బీసీల అంశాన్ని పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్, బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలే.. బీజేపీ దాన్ని కేంద్రంలో ఆమోదించాలి.. ఇదే మా డిమాండ్ : ఎమ్మెల్సీ కవిత
బీసీల అంశాన్ని పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా సోమవారం ఎర్రవెల్లి గ్రామస్తులు నిర్వహించిన యాగంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కుల గణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదోవ పట్టించడానికే మోదీ బీసీనా.. కాదా అన్న చర్చను రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారన్నారు. మోదీ బీసీ అయితే ఏంది కాకపోతే ఏంది.. రాహుల్ గాంధీది ఏ మతమైతే మాకేంది? బీసీల జనాభాను సరిగా లెక్కపెట్టాలన్నదే మా డిమాండ్.. అని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని.. దానిని కేంద్రంలో బీజేపీ ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని.. ఇది మాత్రమే తమ డిమాండ్ అన్నారు. అవి చేయకుండా రాహుల్ గాంధీ, మోదీ కుల మతాల గురించి ప్రజలకు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నాయని అన్నారు. బీసీ బిడ్డలను మోసం చేయొద్దని కాంగ్రెస్, బీజేపీలను హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలు మాట్లాడి రాష్ట్ర ప్రజలను ఆగం చేస్తున్నారని.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేసి 14 నెలలు గడిచినా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదన్నారు. కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించిన ధీరుడు అన్నారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పూజలు చేస్తున్నారని.. ఈ రోజు ఆయనను తలచుకోని గుండె లేదు అన్నారు.