'సంస్కారీ రేపిస్టుల' విడుదల విషయంలో కేంద్రం తీరు అవమానం... అసహ్యం...-కేటీఆర్
గుజరాత్ లో బిల్కినో బానోను రేప్ చేసి ఏడుగురిని హత్య చేసిన దోషులను కేంద్రం అనుమతితోనే విడుదల చేసిన విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇది చాలా అవమానం, అసహ్యం అని ఆయన వ్యాఖ్యానించారు.
రేపిస్టుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సాగుతున్న కేసుకు సంబంధించిన విచారణలో గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే వారిని విడుదల చేసామంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
''షాకింగ్!! గుజరాత్ ప్రభుత్వం "సంస్కారీ రేపిస్టులను" విడుదల చేసిందని అందరూ అన్నారు.
అవమానకరమైన, అసహ్యకరమైన విషయమేంటంటే...నిజానికి దీన్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వమే!
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రేపిస్టులను, పిల్లలను చంపేవారిని వదిలేయడం చూస్తూ ఉంటే బీజేపీ ఎంత దిగజారిన ప్రమాణాలు గల పార్టీయో అర్దంఅవుతోంది. '' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ పై పెద్ద ఎత్తున నెటిజనులు స్పందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ ఓట్ల రాజకీయాలకోసమే రేపిస్టులను వదిలేసిందని ట్విట్టర్ విమర్శలు చేస్తున్నారు.