ప్రజల ఆకాంక్షలు తొక్కి బుల్డోజర్ల పాలన తెచ్చింది

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది పాలనపై మావోయిస్టు పార్టీ ధ్వజం

Advertisement
Update:2024-11-14 15:22 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తొక్కిపెట్టి బుల్డోజర్ల పాలన తెచ్చిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ధ్వజమెత్తింది. గురువారం మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ ప్రకటన విడుదల చేశారు. ''రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం దూకుడుగా పని చేస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులైన.. జీవించే హక్కును కాల రాస్తున్నది. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తోంది. తద్వారా కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ ను ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) చేయడానికే మూసీ సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో హైడ్రాకు విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తోంది. మూసీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే పేరుతో వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ నివసిస్తున్న వారి జీవించే హక్కును కాలరాస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలు, నగరంలోని మురుగు నీటితోనే మూసీ మురికికూపంగా మారిందనే విషయం ప్రభుత్వం విస్మరిస్తున్నది..'' అని పేర్కొన్నారు.

అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా సంస్థలు, వ్యక్తులు నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను కాకుండా అన్నిరకాల అనుమతులతో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తూ వారిని ఆక్రమణదారులుగా ప్రచారం చేస్తున్నారు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యంగా బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ''వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో వీఎల్ఎఫ్‌ (వెరీ లో ప్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్(నేవీ రాడార్) స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దామగుండంలో నేవి రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 2,900 ఎకరాల భూమిని అప్పగించారు. దీనితో సహజ సిద్ధమైన అనంతగిరి కొండలున్న రిజర్వు ఫారెస్టు ద్వంసం అవుతుంది. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా సిటీ నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కొల్పుతున్న రైతులు జీవన, మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు బనాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవ కారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కామ్రేడ్‌ నల్లమారి అశోక్ ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామం వద్ద ఆరుగురు విప్లవకారులను పాశవికంగా హత్య చేశారు..'' అని ఆగ్రహం చేశారు.

''నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో, బాధ్యత రాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదు. ఉద్ద్యేశ పూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ముకాస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారి పెట్టుబడులలో వాటా, పెద్ద మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడు. ప్రజలారా! రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల, ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక, పాశవిక పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసినది ప్రక్షాళన పేర్లతో మద్య తరగతి, పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవి రాడార్ స్టేషన్ ను, ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి..'' అని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News