దమ్ముంటే నిరూపించు.. కిషన్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్
తెలంగాణ ఉద్యమ సమయంలో కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయని అసమర్ధుడు, దద్దమ్మ కిషన్ రెడ్డి అని విమర్శించారు కేటీఆర్.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సిగ్గు లేదు, విషయ పరిజ్ఞానం అంతకంటే లేదని తీవ్రంగా విమర్శించారు మంత్రి కేటీఆర్. హుజూర్ నగర్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన పైసలు పక్కదారి పడుతున్నాయంటూ కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే తాను చెప్పేది తప్పు అని నిరూపించాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి, నలుగురు సన్నాసి ఎంపీలు అవాకులు చెవాకులు పేలడం ఇకనైనా కట్టిపెట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో 3.68 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించిందని, అందులో 1.68 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం తిరిగి ఇచ్చిందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షల రూపాయలని, కేసీఆర్ పాలనలో ఇప్పుడది 2.78 లక్షల రూపాయలకు చేరిందని, ఇవి తాము చెబుతున్న లెక్కలు కాదని, రిజర్వ్ బ్యాంక్ లెక్కలని అన్నారు కేటీఆర్. అదే సమయంలో దేశ తలసరి ఆదాయం 1.49 లక్షల రూపాయలు మాత్రమేనని గుర్తు చేశారు. ఎవరు గొప్పో తేలిపోయింది కదా అని అన్నారు కేటీఆర్.
ఇక ప్రధాని నరేంద్రమోదీ విషయానికొస్తే ఆయన ముందు 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే.. నరేంద్ర మోదీ చేసిన అప్పు చాలా ఎక్కువ అని అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అప్పులు చేసిందని, తాము తెచ్చిన ఆ అప్పు భవిష్యత్తు మీద పెట్టుబడి మాత్రమేనన్నారు. మోదీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా.. జెండా, అజెండా, మనుషులు, డీఎన్ఏ ఏవీ మారలేదని స్పష్టం చేశారు కేటీఆర్.
తాను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి అబద్ధమైనా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తాను చెప్పినవి అబద్ధాలని కిషన్ రెడ్డి నిరూపించలేకపోతే ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబితే చాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయని అసమర్ధుడు, దద్దమ్మ కిషన్ రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. అలాంటి కిషన్ రెడ్డి ఇప్పుడు సవాల్ లో ఓడిపోతే కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటాడని తాను అనుకోవడంలేదని, అందుకే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నానని చెప్పారు కేటీఆర్.