మెట్రోరైల్ రెండో దశకు సహకరించండి.. కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్ నగరంలో పారిశుధ్య నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.400కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులను కేంద్రం అందించాలన్నారు.
మెట్రో రైల్ రెండో దశకు సహకరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలసి విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగానే పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఈమేరకు కేంద్ర మంత్రికి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ బృందం మెమొరాండం సమర్పించింది. కేటీఆర్ వెంట ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు.
ఢిల్లీ పర్యటనలో తొలిరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలసిన కేటీఆర్, రెండో రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రో లైన్ కు ఆమోదం తెలపాలని ఆయన్ను కోరారు. ఆమోదంతోపాటు ఆర్థిక సహాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం పూర్తవుతోందని, అదే సమయంలో అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పురపాలిక సంఘాలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రూ.2,400 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ. 800 కోట్లు కేటాయించాలన్నారు కేటీఆర్.
హైదరాబాద్ నగరంలో పారిశుధ్య నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.400కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులను కేంద్రం అందించాలన్నారు. రూ.450 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలోని మున్సిపాల్టీల్లో బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని. ఈ ప్రాజెక్ట్ కి రూ.3,777 కోట్ల ఖర్చు అవుతుందని ఇందులో రూ. 750 కోట్లను కేంద్రం ఆర్థిక సాయం రూపంలో విడుదల చేయాలని కోరారు కేటీఆర్.