కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది.;
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నాటి నుంచి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఆ క్రమంలో కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఫైనల్ చేశారు. ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ తోపాటు, లైట్ బ్లూ కలర్లో కార్డులు ఉండనున్నాయి. కార్డులపై ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండనున్నాయి. ఫస్ట్ గతంలో అప్లై చేసుకున్న వారికి వారికి జారీ చేసి.. అనంతరం అందరికీ దశల వారీగా ఈ కొత్త కార్డులు జారీ చేయనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తులు 13 లక్షల వరకు స్వీకరించింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సంబంధించినవి 24 లక్షల వరకు వచ్చాయి. వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం.. కొత్త కార్డులు జారీ చేసేముందు, రేషన్ కార్డుల రూపు రేఖలు కూడా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రభుత్వం ఆదేశించారు. మార్చి 1న లక్ష కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా.. కొన్ని సాంకేతిక కారణాలతో కార్డుల పంపిణీ వాయిదా వేశారు.