పోరాటాలు మనకి కొత్త కాదు - కేటీఆర్

ఎంతో మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. అందరూ సమైక్యంగా ఉండాలనే సమైక్యత వేడుకలు జరుపుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

Advertisement
Update:2022-09-16 18:18 IST

తెలంగాణ గడ్డకు పోరాటాలు కొత్త కాదని అన్నారు మంత్రి కేటీఆర్. 1948లో రాచరికపు ప్రభువుపై, 1956లో ఆంధ్రాలో విలీనమైనప్పుడు, 1960 దశకంలో తెలంగాణ కోసం, 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కోసం పోరాటం జరిపి లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తు చేశారాయన. ఎంతో మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ సమైక్యంగా ఉండాలనే `సమైక్యత` వేడుకలు జరుపుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. మతపిచ్చి, వైషమ్యాల మాయలో పడితే తెలంగాణ దశాబ్దాల వెనుకబాటుకు వెళ్తుంద‌న్నారు కేటీఆర్. చిల్లర మాటలు, పంచాయితీలతో తెలంగాణకు ఒరిగేదేమీ ఉండద‌ని స్ప‌ష్టం చేశారు.

భారత్‌ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోందని, త్యాగ‌ధ‌నుల‌ను స్మ‌రించుకోవ‌డానికి ఇది మంచి వేదిక అని చెప్పారు కేటీఆర్. తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టడం హర్షణీయమ‌న్నారు. అంబేద్క‌ర్ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంద‌ని తెలిపారు.

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత సంక్షేమానికి మన రాష్ట్రం ట్రేడ్ మార్క్‌గా నిలిచింద‌న్నారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 నుంచి 90 శాతం కుటుంబాల‌కు పెన్ష‌న్ అందుతుంద‌ని చెప్పారు. జిల్లాకు కొత్త‌గా 17 వేల పెన్ష‌న్లు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నామ‌ని అన్నారు. జిల్లాలో గతంలో ఒక్కటే డిగ్రీ కాలేజీ ఉండేద‌ని, వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాల సహా అనేక కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు. త్వరలో మెడికల్ కాలేజీ కూడా జిల్లాకు వస్తుందని చెప్పారు కేటీఆర్. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేవని, ఇప్పుడు 40 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. 62 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తున్నామని అన్నారు. రైతుల తరపున బీమా చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేటీఆర్. 70 ఏళ్లలో కాని అభివృద్ధి తెలంగాణలో 8 ఏళ్ల‌లో జరిగిందని వివరించారు.

మాటి మాటికీ హైదరాబాద్ వస్తున్న అమిత్ షా తెలంగాణకు ఏమైనా నిధులు తెస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కేంద్రం వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం ఎనిమిదేళ్లుగా మొత్తుకుంటున్నా ఫలితం లేదన్నారు. ఎనిమిదేళ్ల లో లేనిది కొత్తగా కులం, మతం అంటూ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. వైషమ్యాలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు, ముస్లింలు అంటూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ కుట్రల్ని ప్రజలు గమనించాలని చెప్పారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News