రంగంలోకి మార్కోస్.. ఆ 8 మంది జాడ తెలిసేనా?
సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున మట్టి పేరుకుపోయింది. ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్లలో నీరు ప్రవహిస్తున్నది. పూడుకున్న మట్టి తీస్తే తప్పా టీబీఎం ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి నేడు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. దీనికోసం నేల, నీరు, ఆకాశం.. ఎక్కడైనా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనున్నది. దీని సభ్యులనే మార్కోస్‌గా పిలుస్తారు.. మార్కోస్‌తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) భాగస్వామ్యం పంచుకోనున్నది.