శంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలి : కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
"ఉపవాసాలు, జాగరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా శివుడిని కొలిచే పర్వదినం మహా శివరాత్రి. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తూ సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పరమశివుని ఆశీస్సులతో అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హరీశ్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయని అన్నారు. గరళాన్ని తన కంఠంలో దాసుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమా శంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలకుండాలని ఆకాంక్షించారు. సుఖ శాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్ ఆ మహాశివున్ని ప్రార్థించారు.