ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
రేపే రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు, వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్స్ స్థానానికి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్స్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సమాగ్రిని అందజేశారు. కరీంనగర్ లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ స్థానానికి 3,55,159 మంది ఓటర్లు, టీచర్స్ స్థానానికి 27,088 మంది ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ స్థానానికి 499, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 274 పోలింగ్ స్టేషన్‌లు ఉండగా, రెండు ఎన్నికలకు కలిపి 93 కామన్ పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయని రిటర్నింగ్ అధికారి వివరించారు.