సీఎస్ ని ఉద్దేశిస్తూ తెలంగాణ గవర్నర్ సెటైరికల్ ట్వీట్..
ఢిల్లీకంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంటుందని సెటైర్లు పేల్చారు. “డియర్ సీఎస్ రాజ్ భవన్ ఈజ్ నియరర్ దేన్ ఢిల్లీ” అని రెండుసార్లు తన ట్వీట్ లో గుర్తు చేశారు గవర్నర్.
తెలంగాణ గవర్నర్ తమిళిసై, చీఫ్ సెక్రటరీని ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్ వేశారు. సీఎస్ గా శాంతికుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వద్దకు కనీసం మర్యాదపూర్వకంగా కూడా రాలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అదే సమయంలో పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో సీఎస్ రిట్ పిటిషన్ వేయడాన్ని కూడా పరోక్షంగా తప్పుబట్టారు గవర్నర్. ఢిల్లీకంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంటుందని సెటైర్లు పేల్చారు. “డియర్ సీఎస్ రాజ్ భవన్ ఈజ్ నియరర్ దేన్ ఢిల్లీ” అని రెండుసార్లు తన ట్వీట్ లో గుర్తు చేశారు గవర్నర్.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ ఎ.శాంతికుమారి దాఖలుచేసిన ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాలను చేర్చారు.
2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఇంతవరకు గవర్నర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ చర్యను నిష్క్రియాత్మకత, విస్మరణ, రాజ్యాంగ విధినిర్వహణలో విఫలమైనట్లుగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులకు ఆమోదం తెలపకపోవడం తీవ్రమైన చట్టవ్యతిరేక చర్యగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. తక్షణం ఈ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరింది.
ఈ రిట్ పిటిషన్ తో గవర్నర్ కి ఆగ్రహం వచ్చినట్టు తెలుస్తోంది. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను ఇంతవరకు కలవని శాంతి కుమారి, ఢిల్లీ వెళ్లి తనపై రిట్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారనే అర్థం వచ్చేలా గవర్నర్ ట్వీట్ వేశారు. ‘‘రాజ్‌భవన్ ఢిల్లీ కంటే దగ్గరగా ఉంటుంది. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్ భవన్ కు రావడానికి శాంతికుమారికి సమయం లేదా? అధికారికంగా రాలేదు, ప్రొటోకాల్ లేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్ నన్ను కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి’’ అని తమిళిసై ట్వీట్ చేశారు.