'ఆరోగ్య మహిళ' పథకాన్ని ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

దగ్గర్లో ప్రభుత్వాసుపత్రి లేకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ ఫీజులు చెల్లించలేని పరిస్థితి కారణంగా మహిళలు అనారోగ్యాన్ని దాచి పెట్టుకుంటున్నారని మంత్రి అన్నారు.

Advertisement
Update:2023-03-08 13:18 IST

మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా 'ఆరోగ్య మహిళ' పథకాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కరీంనగర్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళా పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

కేవలం ఆరోగ్య మహిళ పథకం కోసమే 100 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ఆసుపత్రుల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని.. దీని వల్ల మహిళలు ఏ మాత్రం భయం లేకుండా తమకు వచ్చిన అనారోగ్యాన్ని చెప్పుకునే వీలుంటుందని హరీశ్ రావు అన్నారు. మహిళలు ఎంత సేపూ కుటుంబ పోషణకు సంబంధించి విషయాల పట్టించుకోని.. తమ గురించి తాము శ్రద్ధ తీసుకోరు. అందుకే మహిళల్లో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇక దగ్గర్లో ప్రభుత్వాసుపత్రి లేకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ ఫీజులు చెల్లించలేని పరిస్థితి కారణంగా మహిళలు అనారోగ్యాన్ని దాచి పెట్టుకుంటున్నారని మంత్రి అన్నారు. ఈ సమస్యలన్నింటీ పరిష్కారమే 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం అని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

ఈ పథకం ద్వారా మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. అలాగే ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు.. విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి అవసరమైన చికిత్స, మందులు అందజేస్తారు.

మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు కూడా నిర్వహిస్తారు. మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరం అయిన వారికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తారు. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. మహిళలకు సెక్స్ సంబంధిత అంటు వ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరుపు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై కూడా అవగాహన కల్పిస్తారు.



Tags:    
Advertisement

Similar News