గ్రేటర్‌లో సరికొత్త పాలన..!

ప్రతి వార్డు కార్యాలయంలో బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఎంటమాలజి, జలమండలి, విద్యుత్ తదితర విభాగాలకు చెందిన 10మందితో కూడిన అధికారుల బృందం ఉంటుంది.

Advertisement
Update:2023-06-16 11:00 IST

ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ సర్కారు కొత్త పంథాను అనుసరిస్తోంది. ప్రజల వద్దకే పాలనను చేర్చుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాలనా వికేంద్రీకరణలో భాగంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం.

గ్రేటర్‌లో వార్డు పాలనా వ్యవస్థను ప్రారంభించింది తెలంగాణ సర్కారు. ప్రస్తుతం ఉన్న గ్రేటర్‌ ప్రధాన కార్యాలయం, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాలకు అదనంగా వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో తొలిసారి ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై వార్డు కార్యాలయాల కేంద్రంగా నగరవాసుల సమస్యలను పరిష్కరించనున్నారు. గ్రేటర్‌లోని ప్రతి డివిజన్‌కు ఒకటి చొప్పున 150 వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

ప్రతి వార్డు కార్యాలయంలో బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఎంటమాలజి, జలమండలి, విద్యుత్ తదితర విభాగాలకు చెందిన 10మందితో కూడిన అధికారుల బృందం ఉంటుంది. వీరంతా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో సేవలందిస్తారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వార్డు కార్యాలయ సిబ్బంది ప్రతి రోజూ వార్డులో పర్యటించి సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు.

వార్డు కార్యాలయంలోని రిసెప్షనిస్ట్‌ ఫిర్యాదులను స్వీకరించడం వాటిని ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి పంపిస్తారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత దరఖాస్తుదారుడికి సమాచారం అందిస్తారు. ప్రతి సమస్య పరిష్కారానికి క‌చ్చితమైన సమయాన్ని నిర్దేశిస్తూ సిటీజన్ చార్ట్‌ను కూడా రూపొందించారు. మోండా మార్కెట్ రెజిమెంటల్ బజార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సులభతరమైన సేవలను అందించేందుకే వార్డు ఆఫీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News