అకాల వర్షాలతో యాసంగి పంట నష్టం.. నివారణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని, సాగు నీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది.
అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. యాసంగి వరి పంట సాగులో యాజమాన్య పద్ధతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగు, ఇతర అంశాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో మంత్రి వర్గ ఉప సంఘం విస్తృతంగా చర్చించింది. తదుపరి సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రులు సూచించారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని, సాగు నీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది. అయితే యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో రైతుకే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ నష్టం నివారించడానికి గత కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వీటిపై వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.