అమరవీరుల స్థూపం నుంచి అసెంబ్లీ వరకు.. జై తెలంగాణ నినాదాలు
అమరవీరుల స్థూపం నుంచి అసెంబ్లీకి జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తొలిరోజు సభలో లాస్యనందిత మృతికి సంతాపం తెలిపారు సభ్యులు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు నేతలు. అక్కడినుంచి అసెంబ్లీకి జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. తొలిరోజు సభలో ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాపం తెలిపారు సభ్యులు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
కేటీఆర్ భావోద్వేగం..
ఇదే సభలో కేసీఆర్ సీఎంగా సాయన్నకు సంతాపం ప్రకటించామని, ఆయన కుమార్తె లాస్యనందితకు సంతాపం తెలిపే సందర్భం వస్తుందని ఊహించలేదని అన్నారు కేటీఆర్. ఏడాది కాలంలోనే సాయన్న కుటుంబంలో రెండు మరణాలు సంభవించాయని, ఆ కుటుంబానికి దేవుడు మానసికస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించామని, కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరమని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న మృదు స్వభావి అని, అజాత శత్రువు అని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేశారన్నారు. తన కుమార్తెను కార్పొరేటర్ గా చూడాలనేది సాయన్న కల అని, కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో లాస్య నందిత తొలుత కార్పొరేటర్ గా గెలిచారని చెప్పారు. సాయన్న మరణంతో లాస్యనందితకు కేసీఆర్ అవకాశమిచ్చారని, గత ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచారని, కానీ ఆ కుటుంబంపై విధి పగబట్టిందేమో అనిపిస్తుందని అందుకే ఒకే ఏడాదిలో తండ్రీ కూతురు మరణించారని అన్నారు కేటీఆర్.
ఉప ఎన్నికల్లో లాస్య నందిత సోదరి నివేదితకు అవకాశం ఇచ్చామని, దురదృష్టవశాత్తు ఆమె ఓటమిపాలైందని చెప్పారు కేటీఆర్. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారాయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, వివేకానంద గౌడ్ తదితరులు లాస్యనందిత సంతాప తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడారు. ఆ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.