బీఆర్ఎస్‌ కార్పొరేటర్ల సస్పెన్షన్, అరెస్ట్‌

రసాభాసగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం

Advertisement
Update:2025-01-30 13:29 IST

జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస నెలకొన్నది. బడ్జెట్‌ ఆమోదం తర్వాత ప్రజాసమస్యలపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ పట్టుబట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్‌ బైటికి తీసుకెళ్లారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ మిగతా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను మళ్లీ తీసుకువచ్చి సభను నిర్వహించాలన్నారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. మేయర్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పట్టువీడలేదు. ఈ క్రమంలోనే ఆమె అసహనంవ్యక్తం చేస్తూనే మార్షల్స్‌ తీసుకెళ్లిన కార్పొరేటర్లను సభలోకి తీసుకురావాలని ఆదేశించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ భద్రత నడుమ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నలుదిక్కులా వందలాది మంది పోలీసుల మొహరించారు. మరోవైపు నలుగురు కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లందరినీ మేయర్‌ సస్పెండ్‌ చేశారు. వారిని మార్సల్స్‌ బైటికి పంపించగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అభివృద్ధి కోసం నిధులు అడిగితే అరెస్టులు చేస్తారా?: హరీశ్‌రావు

జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా? రాష్ట్రానికి గుండె కాయ లాంటి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తున్న మీ వైఖరిని నిలదీస్తే మార్షల్స్ తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్ నుంచి బయటికి పంపిస్తారా? అని ప్రశ్నించారు.బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే అమోదిస్తున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికమని, మీ నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనం అన్నారు. ప్రజల తరుపున ప్రశ్నించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు: కేటీఆర్

జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులనుబీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా? గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా, మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా?అని నిలదీశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్‌ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నది. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి.అప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం.అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Tags:    
Advertisement

Similar News