సీఎం రేవంత్‌కు సుప్రీంకోర్టు వార్నింగ్!

రాజకీయ పార్టీలతో మాట్లాడి మేము తీర్పులు ఇస్తామా అంటూ ఎదురు ప్రశ్నించింది. సీఎం ప్రవర్తన ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిస్తామంటూ హెచ్చరించింది.

Advertisement
Update: 2024-08-29 11:32 GMT

సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కవిత బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరపు న్యాయవాది. ఈ విషయంపై స్పందించిన న్యాయస్థానం.. బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి కోర్టు తీర్పును ఎలా తప్పుపడతారని ప్రశ్నించింది. ఐతే ఇలాంటి కామెంట్స్‌ను తాము పట్టించుకోమని, మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటామని జస్టిస్ గవాయి ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలతో మాట్లాడి మేము తీర్పులు ఇస్తామా అంటూ ఎదురు ప్రశ్నించింది. సీఎం ప్రవర్తన ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిస్తామంటూ హెచ్చరించింది.



ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్‌ బీజేపీకి ఎంపీ సీట్లు త్యాగం చేసిందన్నారు. బీఆర్ఎస్-బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ కవితకు 5 నెలల్లోనే ఎలా వచ్చిందంటూ అనుమానాలు లేవనెత్తారు రేవంత్.



ఇక 2015 నాటి ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి నిందితుడిగా విషయం తెలిసిందే. ఇదే కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి గతంలో జైలుకు కూడా వెళ్లారు. ఐతే ఇప్పుడు ఆయన సీఎంగా ఉండడంతో కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News