అసెంబ్లీ ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఓయూలో విద్యార్థినుల నిరసన
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో విద్యార్థినులు నిరసన చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు నిరసన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీలోని వివిధ కళాశాలల్లో విద్యార్థినులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు పంపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. రూ. 4000 నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కి సంవత్సరం గడుస్తున్న హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో విద్యారంగం కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో సమస్యలు ఎక్కడివక్కడే ఆగిపోయాయని వాపోయారు. ఈ సందర్భంగా “ప్రియాంక గాంధీజీ వేర్ ఇస్ మై స్కూటీ”, “వి వాంట్ స్కూటీ” అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు