బాధ్యతగా మాట్లాడండి.. సీఎం రేవంత్‌కు సుప్రీం సూచన
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట దక్కింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేసును బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ పిటిషన్‌పై విచారణను ముగించింది. కేసు విచారణపై విశ్రాంత జడ్జి పర్యవేక్షణకూ సుప్రీంకోర్టు నిరాకరించింది.
స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాదర్శకంగా విచారణ చేపట్టాలి. సీఎం, హోం మంత్రిగా ఉన్న రేవంత్‌కు ఏసీబీ డీజీ రిపోర్ట్ చేయనక్కరలేదని కోర్టు పేర్కొన్నది. ఓటుకు నోటు కేసు విచారణలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో సీఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లవచ్చని సూచించింది.
విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుందని.. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని పేర్కొన్నది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా సీఎం సుప్రీంకోర్టు జడ్జీలు, లాయర్ల చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు, పోస్టులపై సుప్రీంకోర్టును క్షమాపణ కోరారు. సీఎం క్షమాపణలను సుప్రీంకోర్టు అనుమతించింది.