కన్న కొడుకే.. కాల యముడై.. ఆస్తి కోసం తండ్రినే చంపించిన వైనం
తన తండ్రిని ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం పావనికే రాసి ఇస్తాడని ఉద్దేశంతో ఎలాగైనా తండ్రిని హతమార్చాలని అతని కుమారుడు పథకం వేశాడు.
కన్న కొడుకే కాలయముడయ్యాడు.. ఆస్తి కోసం తండ్రినే హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ రాజేశ్ శనివారం వెల్లడించారు. షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ కమ్మరి కృష్ణ (కేకే)కు మొదటి భార్య, పిల్లలు ఉన్నప్పటికీ.. వారిని పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె మృతిచెందిన తర్వాత మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య పావనికి 16 నెలల కుమార్తె ఉంది. ఆమె పేరిట దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఆస్తిని కేకే రిజిస్ట్రేషన్ చేశాడు.
తండ్రి అంగరక్షకుడితోనే సుపారీ మాట్లాడుకుని...
తన తండ్రిని ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం పావనికే రాసి ఇస్తాడని ఉద్దేశంతో ఎలాగైనా తండ్రిని హతమార్చాలని అతని కుమారుడు పథకం వేశాడు. తండ్రి వద్ద పని చేసే అంగరక్షకుడు బాబా శివానంద్ అలియాస్ బాబాకు రూ.25 లక్షలు, ఒక ఇల్లు ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన బాబా శివానంద్ రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఈ నెల 10న సాయంత్రం 5.30 గంటలకు జీలకర్ర గణేష్ ఆలియాస్ లడ్డు, మరో మైనర్ బాలుడితో కలిసి కమ్మదనంలోని కేకే ఫామ్ హౌస్‌కు వెళ్లాడు.
ఫామ్ హౌస్‌లోనే దారుణం...
ఫామ్ హౌస్‌లో కృష్ణను గణేష్, మైనర్ బాలుడు చేతులు వెనక్కి పట్టుకోగా, బాబా కత్తితో గొంతు కోసి, పొట్టలో పొడిచి పరారయ్యారు. అతని అరుపులు విన్న పై అంతస్తులో ఉన్న భార్య అక్కడికి చేరుకుంది. వెంటనే కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. కేకే మూడో భార్య పావని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి.. నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఒక బైక్, 3 కత్తులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేకేకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అతని మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడో భార్య సంతానం మొదటి పుట్టినరోజు వేడుకలు 4 నెలల క్రితం నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించాడు.