రేవంత్‌రెడ్డి ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపిండు : కేటీఆర్
ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అమన్‌గల్‌ల్‌లో జరిగిన రైతుదీక్షలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపిండు. అత్తకు రూ. 4 వేలు.. కోడలికి రూ. 2500 అన్నాడు. రూ. 500కు సిలిండర్ అన్నడు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నడు.. ఇప్పటి వరకు ఏది లేదు. 35 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిండు తప్ప 35 పైసలు ఢిల్లీ నుంచి తేలేదు అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఇదే కల్వకుర్తి తాలుకాలో, పాలమూరు జిల్లాల్లో రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమై వేరే రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. కానీ రేవంత్ పాలనలో ఏడాది తిరగక ముందే.. లోన్ కట్టలేదని చెప్పి ఇంటికాడ గేట్ ఎత్తుకు పోయారు. స్టాటర్లు ఎత్తుకుపోయారు. రేపో మాపో తులం బంగారం ఇచ్చుడు కాదు.. మీ పుస్తేల తాడు కూడా ఎత్తుకుపోతడు అని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చారు. రైతుబంధు, రుణమాఫీ ఎవరికైనా వచ్చాయా. తులం బంగారం వచ్చిందా. ఏదీ రాలేదు. దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ కొడంగల్‌కు, తల్లి గారి ఊరికి, అత్తగారి ఊరికి ఎవరికీ ఏమీ చేయలేదు. 42 శాతం రిజర్వేషన్‌లని చెప్పి బీసీలను మోసం చేసిండు.
రైతులను మోసం చేసిండు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాడు. సన్యాసి రేవంత్‌కు పాలన చేతనైతలేదు ’అని కేటీఆర్ ఫైరయ్యారు. పదేండ్ల పాటు కేసీఆర్ హయాంలో రైతు ఒక రాజులాగా బ్రహ్మాండంగా బతికాడు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికీ న్యాయం చేయలేదు. రైతు రుణమాపీ, రైతుబంధు, తులం బంగారం, మహిళలకు రూ. 2500 రాలేదు. 420 హామీలిచ్చి దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. రూ. 2 లక్షల రుణమాఫీ చాలా మందికి కాలేదు. రైతుబంధు కూడా రాలేదు. టకీటకీమని పైసలు పడలేదు. గత 6 నెలల నుంచి అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం. గత పదేండ్లలో మోటార్లు కాలేదు.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలలేదు. అప్పుడు అప్పు అడిగే పరిస్థితి లేదు. నాట్లు వేసే నాటికి రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకుని టకీ టకీమని పడుతాయ్ అన్నాడు. టకీ లేదు టుక్ లేదు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రైతుబంధు కేసీఆర్ బిచ్చమేసినట్లు రూ. 10 వేలు ఇస్తుండు.. నేను రూ. 15 వేలు వేస్తా అన్నాడు. కనీసం 10 శాతం మందికి కూడా రైతుబంధు ఇవ్వలేదు. ఒకేసారి రుణమాఫీ చేస్తా అని అన్నాడు. చారణా కూడా రుణమాఫీ చేయలేదు. 10 శాతం మందికి కూడా బోనస్ పడలేదు అని కేటీఆర్ తెలిపారు.