హిజ్రాలకు షర్మిల క్షమాపణ.. ఇక్కడ కూడా వైఎస్సార్ పేరు వాడాల్సిందేనా..?

హిజ్రాల దెబ్బకు షర్మిల దిగొచ్చారు, సారీ చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పుడూ అలాంటి పని చేయదు.. అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు.

Advertisement
Update:2023-02-22 14:57 IST

నా హిజ్రా అక్కచెల్లెల్లారా, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు క్షమాపణ చెబుతోంది.. అంటూ ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది వైఎస్ షర్మిల. పనిలో పనిగా తమ పార్టీ అధికారంలోకి వస్తే హిజ్రాలకు అందించే ప్రయోజనాల గురించి ఏకరువు పెట్టింది. వైఎస్సార్టీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే, హిజ్రాలందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పింది. సున్నా వడ్డీకి, కుదరకపోతే పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని చెప్పింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చింది.

ఇటీవల ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై విమర్శలు చేసే క్రమంలో పదే పదే కొజ్జా అనే పదం వాడి తన ప్రసంగంతో కలకలం రేపింది షర్మిల. ఆ పదాన్ని అవమానకర రీతిలోనే ఆమె ఉపయోగించిందనే విషయం ప్రసంగం విన్న ఎవరికైనా అర్థమవుతుంది. అయితే షర్మిల మాత్రం పూర్తిగా తన వ్యాఖ్యల్ని కవర్ చేసుకునే విధంగా ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. హిజ్రాలు కూడా ఈ సమాజంలో గౌరవంగా ఉన్నారు, వారికైనా విలువ ఉంది కానీ, ఎమ్మెల్యేకు ఈ సమాజంలో విలువ లేదు, గౌరవం లేదు అనే క్రమంలో తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చింది. హిజ్రాలకు తన వ్యాఖ్యలతో బాధ కలిగి ఉంటే వారికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్షమాపణ చెబుతోంది అంటూ ముక్తాయించింది.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని టార్గెట్ చేసే క్రమంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో హిజ్రాలు, షర్మిల పోస్టర్ ని చెప్పులతో కొట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే షర్మిల క్షమాపణ చెబుతూ మీడియా ముందుకొచ్చారు. క్షమాపణలు చెప్పే క్రమంలో పదే పదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ ఆమె తండ్రిని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీకు చెబుతున్నా, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పుడూ అలాంటి పని చేయదు.. అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. మొత్తమ్మీద హిజ్రాల దెబ్బకు షర్మిల దిగొచ్చారు, సారీ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News