చివరి అర కిలోమీటరు వరకు వెళ్లడమే కష్టతరం
గంట గంటకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో భయంకరంగా మారుతున్న పరిస్థితులు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం భయంకరంగా మారింది. అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొన్నది. టన్నెల్‌లోని అడుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. లోపలికి వెళ్లిన బృందాలు నిరాశతో వెనుదిరుగుతున్నాయి. చివరి అరకిలో మీటరు వరకు వెళ్లడం కష్టతరం అవుతున్నది. 3 కిలోమీటర్ల వరకే సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుతున్నాయి. కన్వేయర్ బెల్ట్, డ్రోన్స్, రోబోటిక్స్ కెమెరాలు సొరంగంలో పనిచేయడం లేదు. మరోవైపు పెరుగుతున్న నీటిని తోడటం కష్టంగా మారుతున్నది. గంటలు గడిచే కొద్ది సొరంగంలో చిక్కున్న 8 మంది కార్మికుల క్షేమ సమాచారంపై ఆశలు అడుగంటుటున్నాయి.
దీంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని వెలికితీసే సహాయక చర్యల్లో పురోగతి కనిపించడం లేదు. మంగళవారం మధ్యాహ్నం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్ సభ్యులు మనుషులు వెళ్లగలిగేంత చివరి దాకా వెళ్లి తిరిగి వచ్చారు. 14 కిలోమీటర్లున్న సొరంగంలో 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ సాయంతో సహాయక బృందాలు వెళ్తున్నాయి. అక్కడ ధ్వంసమైన టీబీఎం అవశేషాలు అడ్డంకిగా మారాయి. పది నుంచి 11.5 కిలోమీటర్ల మధ్య 2 అడుగుల ఎత్తులో నీరున్నది. టీబీఎం మిషన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉన్నది. ఆ తర్వాత 40 మీటర్ల మేర దట్టమైన బురద దాదాపు ఆరేడు అడుగుల ఎత్తులో పేరుకుపోయింది. ఆ అడ్డంకి దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందుభాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉన్నది.
మనుషులు వెళ్లగలిగేంత వరకు ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లి వచ్చాయి. లోపలి మట్టిని తొలిగించినా సెగ్మెంట్లు దెబ్బతిన్న కారణంగా మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందని ర్యాట్‌హోల్ మైనర్స్ బృందం వెల్లడించింది. అక్కడి పరిస్థితిని బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. మొదట సొరంగంలో భారీ ఎత్తున పేరుకుపోయిన నీరు అడ్డంకిగా మారుతున్నది. నీళ్లు తోడిన తర్వాత శిథిలమైన టీబీఎం ప్రతిబంధకమైంది. కన్వేయర్ బెల్టు సాయంతో దాన్ని దాటినా టీబీఎం మొదటి భాగానికి, చివరి భాగానికి మధ్య ఐదు ఆరు అడుగుల ఎత్తులో నిలిచిన మట్టి, బురద, నీటి ఊట ప్రధాన ఆటంకాలుగా మారాయి. టీబీఎం ముఖద్వారానికి చేరుకోవాలంటే శిథిలాలను తొలిగించి పూడుకుపోయిన మట్టిని ఎత్తివేయాలి.
ఇవాళ ఆపరేషన్ మార్కోస్
ఎస్‌ఎల్ బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం నాలుగు రోజుల నుంచి వెతుకుతున్న వారి జాడ దొరకడం లేదు. దీంతో సొరంగంలో ఇవాళ ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలు చేపట్టే సత్తా ఉన్న ఇండియన్ మైనర్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనున్నది. ఈ సభ్యులనే మార్కోస్‌గా పిలుస్తారు. మార్కోస్‌తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) భాగస్వామ్యం పంచుకోనున్నది. ఈ మేరకు బీఆర్‌వో లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ తన బృంద సభ్యులతో ఇక్కడి రానున్నారు. సొరంగంలో పైకప్పు కూలి బుధవారం పొద్దుగాల వరకు నాలుగు రోజులు అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యల్లో వేగం పెంచింది. ఈ మేరకు కీలక ఆపరేషన్‌కు ఆదేశాలిచ్చింది.