సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు గయాబ్
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్ నుంచి మాయం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు గయాబ్ అయ్యింది. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వెబ్ సైట్ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటి నివేదికను మాయం చేయించింది. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలు అసలు ప్రజలకు అందుబాటులోనే లేవని.. పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి డైలాగులు దంచిన కొద్దిసేపటికే ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్ కు వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కోసం క్లిక్ చేస్తే ''సర్వర్ ఎర్రర్ - 404 ఫైల్ ఆర్ డైరెక్టరీ నాట్ ఫౌండ్'' అని వస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే నివేదికకు సంబంధించిన ఒక స్లైడ్ ను చూపించి అదే నిజమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పటి సర్వేతో పోల్చితే బీసీల జనాభా పెరిగిందని కూడా చెప్పడానికి తంటాలు పడ్డారు. కానీ అదే నివేదికలో బీసీలు, ముస్లిం బీసీల వివరాలు మరో చోట సమగ్రంగా ఉండటంతో ఆ డేటా ఆధారంగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బీసీ నాయకులు ఒక ఆట ఆడుకోవడం మొదలు పెట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము అసెంబ్లీ వేదికగా వెల్లడించిన వివరాలన్నీ డొల్ల అని తేలుతాయనే ఆందోళనతోనే ప్రభుత్వం వెబ్‌సైట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే డాక్యుమెంట్‌ను మాయం చేసిందని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.