భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టాలనుకుంటున్న రేవంత్
ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీన్ని అక్కడి రైతాంగం వ్యతిరేకిస్తున్నదని ఈటల
కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్ సర్వీసులు, కరెంటు బంద్ చేసి వందలమంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై అక్రమ కేసులు సరికాదన్నారు. భూసేకరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప.. బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీన్ని అక్కడి రైతాంగం వ్యతిరేకిస్తున్నదని ఈటల . మా భూములు తీసుకోకండని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారని అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారని ఈటల తెలిపారు. రైతులను అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. గతంలో ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఈటల గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.