కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి భాయ్ భాయ్
చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, కానీ స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమన్నారు రేవంత్ రెడ్డి. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఇద్దరూ.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరు అలకపాన్పు ఎక్కుతారో, ఎప్పుడు ఎవరెవరు సడన్ గా ప్రేమ కురిపించుకుంటారో అర్థం కాని పరిస్థితి. అప్పుడప్పుడూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు తామిద్దరం సోదరులమంటూ ఉమ్మడి స్టేట్ మెంట్ ఇచ్చారు. తమది సోదర ప్రేమ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే వరకు నిద్రపోమంటూ శపథం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి కాసేపు పార్టీ వ్యవహారాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ఇద్దరూ మీడియా ముందుకొచ్చి.. నవ్వుతూ మాట్లాడారు. తెలంగాణలో 15 లోక్ సభ స్థానాలు సాధించే వరకు కలసి పనిచేస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలసే ఉంటామని, రాహుల్ ని ప్రధానిని చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక పార్టీ చేరికలపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్తవారిని చేర్చుకునే విషయంలో సీనియర్లెవరూ అసంతృప్తితో లేరని అన్నారు రేవంత్ రెడ్డి. స్థానిక నేతలను సంప్రదించకుండా.. ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసలు పొంగులేటికి నల్గొండకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. నల్గొండలో కాంగ్రెస్‌లో చేరికలపై రకరకాల కథనాలు వస్తున్నాయియని.. అసంతృప్తి ఉందనుకుంటే కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డితో చర్చిస్తామని చెప్పారు. ఆ ముగ్గురిని సంప్రదించాకే.. ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటామన్నారు.
చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, కానీ స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమన్నారు రేవంత్ రెడ్డి. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఇద్దరూ.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ జూపల్లి మాత్రం ఇంకా సస్పెన్స్ మెయింటెన్ చేస్తూనే ఉన్నారు.