రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నా, మిత్తితో సహా చెల్లిస్తా

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తానన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వేలం వేస్తున్న భూములు కొంటున్న వారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Update:2023-08-14 20:49 IST

పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారాయన. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కి కొంతమంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, వారందరి పేర్లు రెడ్ డైరీలో రాసిపెట్టుకుంటున్నానని అధికారంలోకి రాగానే మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ కి 100 సీట్లు తెచ్చిపెట్టే బాధ్యత తనదేనన్నారు. గాంధీభవన్‌ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలకు కండువా కప్పి కాంగ్రెస్‌ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ పాలనపై నమ్మకం ఉంటే సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇవ్వాలంటూ మరోసారి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమంటూ సర్వేలు చెబుతున్నాయన్నారు. ఆ పార్టీకి 25 సీట్లు కూడా రావన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా, ప్రభుత్వం భూముల వేలం ద్వారా కోట్లు ఆర్జిస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

అన్నీ సరిచేస్తా..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తానన్నారు రేవంత్ రెడ్డి. సొంత మనుషులకు అప్పగించేందుకే వైన్ షాపులకు ప్రభుత్వం ముందస్తు టెండర్లు పిలుస్తోందన్నారు. కాంగ్రెస్ వచ్చాక వైన్ షాపులకు మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వం వేలం వేస్తున్న భూములు కొంటున్న వారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చాక మద్యం టెండర్లు, భూముల వేలం, ORR టెండర్లు, సెక్రటేరియట్‌ నిర్మాణం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అమర వీరుల స్థూపం నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై సమీక్ష చేపడతామన్నారు. అన్నిటినీ సరిచేస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News