ప్రగతిభవన్‌ ను ప్రజాభవన్‌ గా మారుస్తాం- రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేత కేటీఆర్, కాంగ్రెస్ ని అభినందిస్తూ చేసిన ట్వీట్ ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్షం సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

Advertisement
Update:2023-12-03 16:40 IST

ప్రగతి భవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని, అందులో అందరికీ ప్రవేశం ఉంటుందని, అది ప్రజల ఆస్తి అని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే సహా ఇతర నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గేకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించి, సోదరుడిలా అభిమానించి, తనపై భరోసా ఉంచిన రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు రేవంత్ రెడ్డి.


సీఎం.. సీఎం..

రేవంత్ రెడ్డి మాట్లాడినంతసేపు సీఎం సీఎం అంటూ కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ఓ దశలో రేవంత్ రెడ్డి స్వయంగా వారిని వారించారు. తమకు సహకరించిన టీజేఎస్, సీపీఐకి ధన్యవాదాలు తెలిపారాయన. తమకు సహకరించకపోయినా సీపీఎంని కూడా తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు. 2004నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన ఎలా జరిగిందో.. అలాగే ప్రజా పాలన సాగిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.

కేటీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా..

బీఆర్ఎస్ నేత కేటీఆర్, కాంగ్రెస్ ని అభినందిస్తూ చేసిన ట్వీట్ ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్షం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలకు కూడా ప్రయారిటీ ఇస్తామన్నారు. కాంగ్రెస్ మార్కు పాలన ఎలా ఉంటుందో మరోసారి తెలియజేసేలా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో అందరి వాదన వినిపించేలా కాంగ్రెస్ అవకాశమిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలతోపాటు, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పారు. 


Tags:    
Advertisement

Similar News