నేడు అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు

బీసీ రిజర్వేసన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం;

Advertisement
Update:2025-03-17 09:24 IST

సోమవారం రెండు బిల్లులను రేవంత్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నది. వీటికి ఇప్పటికే క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభ ఆమోదం తీసుకోనున్నది. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ, మండలిలో సోమ, మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనున్నది.వీటితో పాటు మంత్రి కొండా సురేఖ దేవాదాయ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటుపై బిల్లు ప్రవేశపెట్టనున్నారు.ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభం కానున్నది. 

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలను ప్రభుత్వ విడుదల చేసింది. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించడానికి వారి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాతం అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25, ముస్లింలకు బీసీ-ఈ కింద 4 శాతం ఉన్నది. 42 శాతానికి పెంచడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంపై, కుల గణన నివేదికపై ప్రభుత్వ లెక్కలను బీసీ సంఘాలు, విపక్షాలు తప్పుపడుతున్నాయి. మొక్కుబడిగా చేసిన ఈ లెక్కలతో బీసీలకు అన్యాయం జరుగుతుందని విమర్శిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం అసెంబ్లీ హాల్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణలోనూ వర్గీకరణ అమలుచేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండటానికి ప్రభుత్వం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ నియమించింది. ఎస్సీ వర్గీకరణపై కూడా షమీమ్‌ అక్తర్‌ నివేదికను ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తప్పుపడుతున్నారు. అలాగే గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. దీంతో వాటిని పరిశీలించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. వాటిని పరిశీలించిన షమీమ్‌ ఆక్తర్‌ కమిషన్‌ తాజాగా సర్కార్‌కు నివేదిక ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులపై జరిగే చర్చ ఎలా ఉండబోతున్నదనే ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News