అక్కడ అమేథీ, ఇక్కడ ఖమ్మం.. రాహుల్ గాంధీ పోటీపై ఆసక్తికర సమాచారం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ విషయంపై చర్చించారట. ఈ ప్రతిపాదనకు రాహుల్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారా..? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్నాళ్లూ సోనియాగాంధీ పోటీ చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. ఆమె రాజ్యసభకు వెళ్లాలనుకోవడంతో ఇప్పుడు రాహుల్ గాంధీపై ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు రాహుల్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఖమ్మం లేదా భువనగిరి లోక్ సభ స్థానాలనుంచి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నుంచి కూడా రాహుల్ బరిలో నిలిచే అవకాశముంది.
ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ రాహుల్ కి కలిసొచ్చిన నియోజకవర్గం. 2004 నుంచి 2019 వరకు ఆయన అమేథీకి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారాయన. గత ఎన్నికల్లో మాత్రం అక్కడ ఓడిపోయారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి గెలవడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈసారి అమేథీతోపాటు తెలంగాణ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అత్యథిక ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయంగా దీన్ని భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ విషయమై చర్చించారట. ఈ ప్రతిపాదనకు రాహుల్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణతోపాటు అమేథీలో కూడా పోటీ అంటే ఆలోచించాల్సిన విషయం. రెండుచోట్ల గెలిచినా ఏదో ఒకచోట రాజీనామా చేయాలి. ఇటీవల కాలంలో ఈ రెండుచోట్ల పోటీ అనేది కత్తిమీద సాములా మారింది. మరి రాహుల్ ఆ దిశగా ఆలోచిస్తారా..? అమేథీతోపాటు తెలంగాణ అంటారా లేక అమేథీని వదిలేసి తెలంగాణకు వస్తారా..? దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.