'మునుగోడు' ప్రచారానికి రాహుల్ దూరమేనా ?

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపున‌కు గ్యారెంటీ లేదు. అలాంట‌ప్పుడు ప్రత్యేకంగా అగ్రనేత ప్రచారం చేసిన తర్వాత కూడా పార్టీ ఓడిపోతే రాహుల్ పరువంతా పోతుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారట.

Advertisement
Update:2022-10-04 08:30 IST

ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయోమయానికి గురిచేస్తోంది. కొందరేమో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వేళ‌ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరికొందరేమో ఉప ఎన్నిక ప్ర‌చారానికి రాహుల్ దూరంగా ఉంటేనే మంచిదని అనుకుంటున్నారు. పార్టీలోని కీలక నేతల మనోగతం చూస్తుంటే ఉప ఎన్నికల ప్రచారంలో రాహుల్ జోక్యం చేసుకునే అవకాశం లేదనే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ నెల 24న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణాలోకి అడుగుపెడుతోంది. నవంబర్ 6వ తేదీ వరకు సాగుతుంది. అంటే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరిగే సమయానికి రాహుల్ తెలంగాణాలోనే ఉంటారన్నమాట. ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో పోలింగుకు ముందు రాహుల్ తెలంగాణాలోనే ఉండటమంటే నిజంగా ఆ పార్టీ నేతలు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలి.

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ రెండు గంటల పాటు రోడ్డు షో లేదా బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్‌ను ఎలాగైనా రప్పించుండాల్సింది. కానీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతల్లో అత్యధికులు ఉప ఎన్నికలో రాహుల్ జోక్యం అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని సమాచారం. ఇదే విషయమై పార్టీలో ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయం బయటపడింది.

ఇంతకీ అదేమిటంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపున‌కు గ్యారెంటీ లేదు. అలాంట‌ప్పుడు ప్రత్యేకంగా అగ్రనేత ప్రచారం చేసిన తర్వాత కూడా పార్టీ ఓడిపోతే రాహుల్ పరువంతా పోతుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారట. కాంగ్రెస్ ఓడిపోతే స్థానిక‌ అంశాలు కారణమవుతాయి.. కానీ రాహుల్ కెపాసిటికి ఇదేమీ పరీక్ష కాదు. కానీ ఓటమికి రాహుల్‌ను బాధ్యుడిని చేయటానికి టీఆర్ఎస్, బీజేపీలు సిద్ధంగా ఉంటాయి. ఉప ఎన్నికలో స్వయంగా ప్రచారం చేసినా గెలిపించుకోలేకపోయారనే అపప్రదను రాహుల్ మోయాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఆలోచించే మునుగోడు ఉప ఎన్నికకు రాహుల్‌ను దూరంగా ఉంచాలని అనుకుంటున్నారు. కాకపోతే శంషాబాద్ దగ్గర ఉపఎన్నిక నేపథ్యంలో బహిరంగ సభ జరిపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నియోజవర్గంలో బహిరంగ సభను వదిలేసి ఎలాంటి సంబంధంలేని శంషాబాద్‌లో నిర్వహించే విషయం ఆలోచిస్తుండటమే విచిత్రంగా ఉంది. బీజేపీ ఏమో కేంద్ర మంత్రులను రంగంలోకి దింపుతోంది. టీఆర్ఎస్ తరపున ఎలాగూ కేసీయార్ ఉండనే ఉంటారు.

Tags:    
Advertisement

Similar News