నేటి నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
నెహ్రూ జయంతి నుంచి సోనియాగాంధీ జన్మదినం వరకు ప్రజా విజయోత్సవాలకు రేవంత్ సర్కార్ సిద్ధం
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తికానుండటంతో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నది. నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో విద్యా విజయోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివిధ శాఖలు ప్రణాళికలు తయారు చేశాయి.
డిసెంబర్ 7 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి 26 రోజుల పాటు వివిధ శాఖలు ఉత్సవాలు నిర్వహించనున్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో విద్యాశాఖ దాదాపు 14 వేల మంది విద్యార్థులతో భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకానున్నారు. విద్యార్థులు మోడల్ అసెంబ్లీని నిర్వహించనున్నారు. ఏడాది లో విద్యాశాఖ అమలు చేసిన కార్యక్రమాలపై సావనీర్ విడుదల చేయనున్నారు. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది.
నెహ్రూ జయంతి నుంచి సోనియాగాంధీ జన్మదినం వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో ప్రణాళిక రూపొందించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏడాది పాలనా విజయాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సుమారు రూ. 18 వేల కోట్ల రూపాయాల వ్యవసాయ రుణాల మాఫీ, మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, 50 వేల మందికి ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. వీటన్నింటిని డ్యాక్యుమెంట్లు, వివిధ రూపాల్లో విస్తృత ప్రచారానికి సర్కార్ సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు సాంస్కృతి కార్యక్రమాలు, సంబరాలతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పారిశ్రామిక ఒప్పందాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విజన్ ను ప్రజలకు వివరించనున్నది. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో వేలాదిమంది కళాకారుల ప్రదర్శనలు, లేజర్ షోలు, తారాజువ్వల ప్రదర్శన వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
గ్రూప్-4 ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీలు ప్రకటించడంతో పాటు పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటునకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర విపత్తు నిర్వహన దళాన్ని ఉత్సవాల్లో ప్రారంభించనున్నారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నారు. డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలు, డాగ్ షో, బ్యాండ్ ప్రదర్శనకు పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తున్నది.