ఇంటికో కుక్కర్.. ఎన్నికలకు ముందే హామీ అమలు..!
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 2వేల ప్రెషర్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫొటోలు ముద్రించి ఉండటంతో కలకలం రేగింది.
మా పార్టీని గెలిపిస్తే ఇంటికో కలర్ టీవీ, గ్రైండర్ ఇస్తామంటూ గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే ప్రకటించింది, గెలిచాక ఆ హామీ అమలు చేసింది కూడా. కాంగ్రెస్ వాలకం చూస్తుంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి హామీ ఇచ్చేట్టుగా ఉంది. అయితే అది పార్టీ హామీ కాదు, అభ్యర్థి ఇస్తున్న హామీ. అవును, ఇంటికో ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, ఎన్నికల్లో నాకే ఓటు వేయండి అంటూ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కంది సంజీవరెడ్డి జోరుగా, హుషారుగా కుక్కర్లన్నీ పంచడానికి రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే అనుకోకుండా పోలీసులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 2వేల ప్రెషర్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫొటోలు ముద్రించి ఉండటంతో కలకలం రేగింది. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు సంజీవరెడ్డి. ఇటీవలే ఆయన అధిష్టానానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుక్కర్లు పంపిణీ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఫొటోతో సహా కుక్కర్లను గోదాంలో నిల్వ చేయడంతో అవి ఎన్నికలకోసమే అనే అనుమానాలు బలపడుతున్నాయి.
అక్రమ నిల్వ..
పక్కా సమాచారం మేరకు గోదాంపై దాడి చేశామని కుక్కర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సీఐ సత్యనారాయణ. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అది అక్రమ నిల్వ అని తేల్చామని చెప్పారు. వాటిని స్వాధీనం చేసుకొని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామన్నారు. ఎన్నికల వేళ ప్రజల్ని ప్రలోభపెట్టాలని చూడటం సరికాదన్నారు. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.