గులాములకే నరేంద్రమోడీ ఫోన్
వరదల బారిన పడినప్పటికీ తెలంగాణలో పరిస్థితిపై మాత్రం నరేంద్రమోడీ కనీసం స్పందించలేదు. మిగిలిన ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిన నరేంద్రమోడీ.. తెలంగాణ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీయలేదు.
మాట్లాడితే ఏక్ భారత్.. అఖండ భారత్ అంటూ పైకి కబుర్లు చెప్పే బీజేపీ నేతలు.. కడుపులో మాత్రం కావాల్సినంత కుళ్లును నింపుకొనే బతుకుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. నరేంద్రమోడీ వచ్చాక.. ప్రధానిగా దేశంలోని అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడడం మానేసి, రకరకాల వివక్షపూరిత కొలమానాలతో ఆయన దేశాన్ని పాలిస్తున్నారని విమర్శిస్తున్నారు.
నరేంద్రమోడీ తనను ఎవరు ప్రశ్నించినా అస్సలు సహించరన్న అభిప్రాయం ఉంది. తనకు లొంగి, ఒంగి దండాలు పెట్టే వారినే ఆయన ఆదరిస్తారన్న విమర్శ ఉంది. కొందరు ఆ వీక్‌నెస్‌ను పట్టుకుని మోడీ ముందు ఒంగిపోయి పాలన సాగిస్తున్నారు. అలాంటి వాతావరణంలో కేసీఆర్ గట్టిగా గళమెత్తడం మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు. తన శత్రువులను ఆదరించే ప్రజలు, ప్రాంతాలు కూడా తనకు శత్రువులేనన్న రాజకీయ సిద్ధాంతాన్ని నరేంద్రమోడీ అనుసరిస్తున్నారన్న విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి.
ఇందుకు చక్కని ఉదాహరణ వరదల విషయంలో నరేంద్రమోడీ వైఖరేనని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు వరదల బారినపడగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నరేంద్రమోడీ ఫోన్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీగా ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. తన వద్ద వినయంగా ఉంటే తన సాయం కూడా అలాగే ఉంటుందని.. పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వానికి చూపెట్టాలన్న ఉద్దేశమో ఏమో గానీ, చివరకు పక్కనే ఉన్న ఏపీని కూడా నరేంద్రమోడీ ప్రభుత్వం బాగానే ఆదరిస్తోంది.
వరదల బారిన పడినప్పటికీ తెలంగాణలో పరిస్థితిపై మాత్రం నరేంద్రమోడీ కనీసం స్పందించలేదు. మిగిలిన ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిన నరేంద్రమోడీ.. తెలంగాణ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీయలేదు. నరేంద్రమోడీ శరీరంలో కల్మషం అనే వరద పోటెత్తుతోందని.. అందుకే వరద వేళ కూడా ఆయన తాను తెలంగాణకూ ప్రధాని అన్న విషయాన్ని మరిచిపోయారని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.
రెండేళ్లుగా తెలంగాణ విషయంలో ఇదే పంథాలో మోడీ ఉన్నారని విమర్శిస్తున్నారు. 2021 ఆఖరిలో కర్నాటకలో వరదలు వస్తే మోడీ వెంటనే సీఎంకు ఫోన్ చేసి అభయం ఇవ్వడమే కాకుండా నెలలోనే భారీగా నిధులు మంజూరు చేశారని గుర్తు చేస్తున్నారు. అదే హైదరాబాద్ 2020లో వరదల్లో చిక్కుకుంటే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఎత్తిచూపుతున్నారు.
2021 డిసెంబర్‌లో గుజరాత్‌కు వెయ్యి కోట్ల రూపాయలను వరద సాయంగా ఇచ్చారని ప్రస్తావిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో గుజరాత్‌కు వరద వచ్చిన సమయంలోనూ మోడీ అంతే వేగంగా స్పందించారని.. అస్సోం వరదల నేపథ్యంలో జూన్ 20న ఆ రాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి ఆర్థిక భరోసా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 2021లో వచ్చిన వరదలకు గాను.. ఈ ఏడాది మార్చిలో ఏపీకి కూడా ఆర్థిక సాయం అందజేశారని.. అనేకమార్లు ప్రకృతి విపత్తుల బారిన పడినా రెండేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏమాత్రం సాయం అందించలేదని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.
సాయం సంగతి అటుంచితే కనీసం సీఎంకు ఫోన్ చేసి అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందన్న ఒక్క మాట కూడా చెప్పలేకపోయారని.. దీన్ని బట్టే నరేంద్రమోడీ ఆలోచన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.