పాపం కిషన్ రెడ్డి.. ప్రచారం కోసం మరీ ఇంత దిగజారాలా?
రాజకీయ నాయకులు అంటే ప్రచారం కోరుకుంటారు. నిత్యం ప్రజల్లో తమ పేరు నానాలని అనుకుంటారు. ఇక అధికారంలో ఉన్న వాళ్లైతే పత్రికల పతాక శీర్షికల్లో పేరుండాలని భావిస్తారు.
రాజకీయ నాయకులు అంటే ప్రచారం కోరుకుంటారు. నిత్యం ప్రజల్లో తమ పేరు నానాలని అనుకుంటారు. ఇక అధికారంలో ఉన్న వాళ్లైతే పత్రికల పతాక శీర్షికల్లో పేరుండాలని భావిస్తారు. అంత వరకు బాగానే ఉన్నది. కానీ, ప్రచారం కోసం తమ స్థాయిని కూడా మర్చిపోవడాన్ని చూసి జనాలు నవ్వుకుంటారు. ఈ సోయి ఇప్పటి రాజకీయ నాయకులకు లేకుండా పోయినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార బీజేపీ నాయకులకు మీడియాలో కనపడాలనే తాపత్రయం ఎక్కువ. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లైమ్‌లైట్‌లో ఉండాలనుకుంటారు. తెలంగాణ బీజేపీలో ఈ ఛాన్స్ ఎక్కువగా బండి సంజయ్‌కే దక్కుతోంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్.. హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్‌లాగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో మీడియా కూడా ఆయన మాటలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దానికి తోడు 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగో విడత పాదయాత్ర చేస్తుండటంతో మీడియా ఆయనకు కవరేజీ బాగానే ఇస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డికి ఎక్కడో తాను వెనుకబడిపోతున్నాను అనే అనుమానం వచ్చినట్లు ఉన్నది. వాస్తవానికి బండి సంజయ్ కంటే ముందు నుంచే బీజేపీలో కీలక నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, లెజిస్లేటీవ్ పార్టీ లీడర్‌గా కిషన్ రెడ్డి ఉన్నారు. ఎప్పుడైతే అసెంబ్లీ వదిలేసి లోస్‌సభ ఎంపీగా మారారో.. అప్పటి నుంచి అతని పేరు రాష్ట్రంలో ఎక్కువగా వినిపించడం లేదు. కేంద్ర మంత్రిగా ఉన్నా పెద్దగా ప్రచారం దక్కడం లేదు.
ఇటీవల పరేడ్ గ్రౌండ్స్, వరంగల్, మునుగోడులో బీజేపీ బహిరంగ సభలు నిర్వహించింది. అన్నింటా బండి సంజయ్ తానై నడిపించారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా, సీనియర్ నేతగా కిషన్ రెడ్డి పేరు పెద్దగా వినిపించలేదు. ఇటీవల తాను రేసులో వెనుకబడ్డానని, రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండాల్సిన తనకు పెద్దగా ప్రచారం లభించడం లేదని మథనపడుతున్నట్లు సమాచారం. అందుకే రాష్ట్రంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యక్రమాలు జరిగినా వెళ్లిపోతున్నారు. కేంద్ర మంత్రి స్థాయిని కూడా దిగజార్చుకొని ఎలాంటి కార్యక్రమమైన హాజరవుతున్నారు.
మంగళవారం సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌ల ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్, కాచిగూడ వంటి పెద్ద స్టేషన్లలో ఓపెనింగ్‌కు వెళ్లారంటే సరేలే అని సర్థిపెట్టుకోవచ్చు. కానీ ఒక లోకల్ స్టేషన్, అందులో లిఫ్టుల ఓపెనింగ్‌కు కేంద్రమంత్రి రావడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కిషన్ రెడ్డి ప్రచారం కోసం చేస్తున్న ఆర్భాటమే అని.. తన స్థాయిని దిగజార్చుకోవడమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే రేపు ఏ బార్బర్ షాపో, మెకానిక్ షెడ్డు ఓపెనింగ్‌కో కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ కేంద్ర మంత్రి కూడా చేయని 'ఓపెనింగ్' కిషన్ రెడ్డి చేశారని అంటున్నారు. మొత్తానికి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.