ఊరెళ్లే బస్సులు కిటకిట.. నగరంలో పోలింగ్ బూత్‌లు వెలవెల
తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. మరోవైపు నగరంలో పోలింగ్ బూత్‌ల్లో ఏ టైమ్‌లో చూసినా పట్టుమని పది మంది కూడా లైన్లో లేని దృశ్యాలే కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఓట్ల పండగ సంబరంగా సాగుతోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రకరకాల కారణాలతో నగరంలో ఉంటున్న తెలంగాణవాసులు సొంతూళ్లోనే ఓటేయాలని తహతహలాడుతున్నారు. అందుకే రెండు రోజులుగా నగరం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. మరోవైపు నగరంలో పోలింగ్ బూత్‌ల్లో ఏ టైమ్‌లో చూసినా పట్టుమని పది మంది కూడా లైన్లో లేని దృశ్యాలే కనిపిస్తున్నాయి.
ఊళ్లో ఓటు ఉంటే ఆ లెక్కే వేరు
ఉన్న ఊళ్లో సొంతిల్లు, కుంటో, ఎకరమో భూమి ఉంటుంది.. రేషను కార్డు అక్కడే ఉంటుంది.. ఆధార్ కార్డులో అడ్రస్సూ అదే. ఏదో భుక్తి కోసం హైదరాబాద్ వచ్చాం కానీ మనది మన ఊరే. ఇది సగటు తెలంగాణ ప్రజల అభిప్రాయం. అందుకే ఓటు హక్కూ అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి ఓటర్లను డబ్బులు ఇచ్చి, వాహనాలు పెట్టి రప్పించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. కొంతమంది ఇలాంటి ప్రలోభాలతోనూ, చాలామంది సొంతూళ్లో తమ ఓటేసి నచ్చిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఉత్సాహంతోనూ ఊళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - ముంబయి రహదారులన్నీ ఆయా రూట్లలో ఉన్న తెలంగాణ ఓటర్లను తీసుకెళ్లే వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఎన్నికల రోజు సగం అయిపోయినా కూడా బస్టాండ్లు, బస్సుల్లో జనం కిటకిటలే.
నగరం మాత్రం నీరసంగానే
మరోవైపు నగరంలో మిగిలి ఉన్న ఓటర్లలో ఎక్కువ మంది పోలింగ్ రోజు కాలు బయటపెట్టడానికి ఇష్టపడటం లేదు. గత ఎన్నికల్లో నగరంలోని 10 నియోజకవర్గంలో సగం మంది కూడా ఓట్లేయలేదు. ఈసారి దాన్ని అధిగమించాలని ఎన్నికల సంఘం ఎన్నిప్రయత్నాలు చేసినా పనికాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు నగరంలోని 90 శాతం నియోజకవర్గంలో పోలింగ్ 20% దాటలేదంటే పరిస్థితి మారలేదని అర్థమవుతోంది.
వాళ్లు అడగనిదానికి ఓటేయడం ఎందుకంటున్నారు..
సాధారణంగా పల్లెల్లో పోలింగ్ బూత్‌లకు అందరూ ఉదయమే వస్తారు. బారులు తీరి లైన్లలో నిలబడి మరీ ఓటేస్తారు. దాన్ని ఓ పండగలా భావిస్తారు. ఓటేయకపోవడం తప్పన్నట్లు భావిస్తారు. తమ ఓటు లేదంటే ప్రాణం పోయినంత విలవిల్లాడిపోతారు. దానికి తగ్గట్లే అభ్యర్థులు వారిని ఏదోరకంగా సంప్రదిస్తారు. ఓట్లేయమని అడుగుతారు. కానీ నగరంలో అభ్యర్థులూ సరిగా రారు.. కనీసం వారి తరఫు వారన్నా వచ్చి ఫలానా అభ్యర్థికి ఓటేయమని అడగరు. వాళ్లకే లేని బాధ్యత మాకేనా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. పేపర్లు, టీవీల్లో చూడకపోతే మా నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారో కూడా మాకు తెలియదు.. కనీసం మా ఇంటికొచ్చి ఓటు కూడా అడగని అభ్యర్థులకు ఓటెందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు కొందరు యువకులు. వాళ్లదీ లాజిక్కే కానీ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటే కాస్త ఓపిక చేసుకుని వెళ్లండి. నగరంలో ఏ పోలింగ్ బూత్‌లో అయినా ఓటేయడానికి పావు గంట మించదు. ఎందుకంటే అంత ఖాళీగా ఉంటున్నాయి.