మళ్లీ తెలంగాణ రాజకీయం మొదలు పెట్టిన పవన్..
పార్టీ పరంగా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలని పవన్ కల్యాణ్ తెలంగాణ జనసేన నేతలకు సూచించారు.
ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ కల్యాణ్, అప్పుడప్పుడు తెలంగాణ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపిస్తుంటారు. సరిగ్గా ఎన్నికలకు ముందు కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత పోటీనుంచి తప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ అభ్యర్థులకు బీఫారమ్ లు ఇచ్చి కూడా వెనక్కి తగ్గారు, బీజేపీతో పొత్తులో ఉన్నా అది ఏపీకే పరిమితం అని కొన్నిసార్లు చెప్పేవారు. మొత్తమ్మీద తెలంగాణలో జనసేన కదలిక పెద్దగా లేదు అనుకుంటున్న తరుణంలో మరోసారి నియోజకవర్గాల ఇన్ చార్జ్ లతో సమావేశం పెట్టి కలకలం రేపారు పవన్ కల్యాణ్.
ఈ ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలనుకుంటోంది. కనీసం కొన్ని స్థానాల్లో అయినా ఉనికి చాటుకోవాలనుకుంటున్నారు నేతలు. అప్పటి వరకూ పార్టీకోసం తిరిగి, చివర్లో పవన్ సైలెంట్ అయితే పరిస్థితి ఏంటనే అనుమానం కూడా వారిలో ఉంది. అయితే పార్టీ పరంగా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునివ్వడం విశేషం. జనసేన తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కో ఆర్డినేటర్లతో పవన్ హైదరాబాద్ లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా 12 నియోజకవర్గాల రాజకీయ, సామాజిక పరిస్థితులపై నివేదిక తయారు చేసి పవన్ కి అందించారు నేతలు. కో ఆర్డినేటర్లతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీపై చర్చించారు. ప్రతి అంశంలో వీర మహిళలను, జన సైనికులను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోఆర్డినేటర్లకు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాల నాయకులతో కూడా సమావేశం అవుతానని పవన్ తెలిపారు. అయితే ఎన్నికల ఏడాదిలో జరుగుతున్న ఈ హడావిడి కనీసం నామినేషన్లు వేసే వరకైనా ఉంటుందా, లేక మధ్యలోనే పవన్ కాడె పడేస్తారా అనేది తేలాల్సి ఉంది.