కొత్త సంవత్సరం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొత్త ఏడాది అంతా మంచే జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఈ ఏడాదంతా శుభం కలగాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. పాత ఏడాది గత స్మృతులన్నీ విడనాడి ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నామని , అన్ని శుభాలు కలగాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ముందుగా అమ్మవారికి విశేష పూజలు చేసిన అర్చకులు అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ, పెద్దమ్మ టెంపుల్, శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.