తగ్గేదే లే అంటున్న నీలం మధు.. బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి
తనను నమ్మించి మోసం చేశారంటూ కాంగ్రెస్ పెద్దలపై మధు మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని, కాంగ్రెస్‌ను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు.
పటాన్‌చెరు కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని చివరి నిమిషంలో అనూహ్యంగా చేజార్చుకున్న నీలం మధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని డిసైడ్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి.. అక్కడ భంగపడినా ఆగకుండా ఇప్పుడు బీఎస్పీలోకి జంప్ అయ్యారు. బీఎస్పీ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బీఆర్ఎస్‌లో పని కాలేదని కాంగ్రెస్‌లోకి వెళితే..
నీలం మధు తొలుత బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్ పుట్టినరోజుకు పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటనలు, హోర్డింగ్‌లతో హోరెత్తించారు. పటాన్‌చెరు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి టికెటిచ్చారు. దీంతో నీలం మధు ఆ పార్టీని వీడారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు టికెటిస్తారా.. అని ప్రయత్నించారు. కాంగ్రెస్ నుంచి హామీ లభించడంతో కొద్దిరోజుల క్రితం ఆ పార్టీలో చేరారు. పటాన్‌చెరు టికెట్ నీలం మధుకే అని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీన్ని మరో కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. తొలి నుంచీ పార్టీలో కష్టపడిన తమకు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్ ఖరారు చేయడమేంటని పార్టీ పెద్దలను నిలదీశారు. దీంతో చివరికి నీలం మధు స్థానంలో శ్రీనివాస్‌కే కాంగ్రెస్ టికెట్ దక్కింది.
కాంగ్రెస్ కాదన్నదని బీఎస్పీలోకి..
తనను నమ్మించి మోసం చేశారంటూ కాంగ్రెస్ పెద్దలపై మధు మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని, కాంగ్రెస్‌ను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్.. మధును కలిసి బీజేపీలోకి వచ్చి తనకు మద్దతివ్వాలని అడిగారు. కానీ, చివరకు మధు బీఎస్పీలో చేరడంతో ఆ పార్టీ ఆయనకు బీఫామ్ ఇచ్చింది. మొత్తంగా ఏదో ఒక పార్టీ తరఫున మధు బరిలోకి దిగుతున్నారు. ఆయన ఎవరి ఓట్లు చీలుస్తారో, ఎవరి గెలుపునకు బాటలు వేస్తారో చూడాలి.