కాదేదీ రాజకీయానికి అనర్హం.. నాంపల్లి ఘటనపై విమర్శల పర్వం

రేవంత్ విమర్శలపై అప్పుడే ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ప్రతి దాన్నీ రాజకీయ కోణంలో చూడొద్దని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అగ్నిప్రమాదంపై సానుభూతి తెలపాల్సిన సందర్భంలో రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Update:2023-11-13 13:46 IST

నాంపల్లిలోని బజార్‌ ఘాట్‌ అపార్ట్‌ మెంట్‌ లో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏకంగా 9మంది మృతి చెందారు, మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. హైదరాబాద్ లో ఈ స్థాయి అగ్నిప్రమాదం, అది కూడా నివాస సముదాయాల్లో జరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటనపై అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్న సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. నివాస సముదాయాల్లో గ్యారేజ్ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ లో కారు మరమ్మత్తులకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.

రేవంత్ విమర్శలపై అప్పుడే ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ప్రతి దాన్నీ రాజకీయ కోణంలో చూడొద్దని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అగ్నిప్రమాదంపై సానుభూతి తెలపాల్సిన సందర్భంలో రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ప్రతి విషయాన్నీ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు. హైదరాబాద్ లో ఓ విద్యార్థిని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే, అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇలాగే ఆరోపించారని చెప్పారు. ఇప్పుడు కూడా రేవంత్ రాజకీయ స్వలాభం కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 

Tags:    
Advertisement

Similar News