సాగర్ నీళ్లు - బీఆర్ఎస్ ఓట్లు.. అర్థంలేని విమర్శలు

లాజిక్ మిస్ అయిన ఈ ఆరోపణలు వినడానికి విడ్డూరంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అయితే కేసీఆర్, జగన్ ఉమ్మడి శత్రువులు మాత్రం ఇలా గాలిలో బాణాలు వేస్తూనే ఉన్నారు.

Advertisement
Update:2023-12-01 13:50 IST

నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు గొడవ పడితే.. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అదనంగా ఓట్లు పడతాయా..?

సాగర్ వద్ద గొడవలు రేపి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఉపకారం చేశారా..?

ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందా..?

నిన్న, ఈ రోజు ఈ అర్థం లేని విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్న పోలింగ్ రోజున కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేశారు, ఈ రోజు సీపీఐ నారాయణ కూడా ఇదే టాపిక్ తెరపైకి తెచ్చారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా హడావిడి నడిచింది. సరిగ్గా ఎన్నికల టైమ్ చూసుకుని నాగార్జున సాగర్ వద్ద గొడవ సృష్టించారని, ఏపీ సీఎం జగన్ పరోక్షంగా కేసీఆర్ కి లాభం చేకూర్చే పనిచేశారని అంటున్నారు. అసలీ వాదనలో నిజం ఎంత..?

నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ విషయంలో నిబంధనలు క్లియర్ గా లేకపోవడంతోనే ఈ చిక్కొచ్చి పడింది. వాస్తవంగా సాగర్ కుడి కాల్వ నుంచి తెలంగాణ అధికారులు నీరు విడుదల చేయాల్సి ఉండగా.. కంచెలు వేసి హడావిడిగా ఏపీ అధికారులు నీరు విడుదల చేసుకున్నారు. ఈ క్రమంలోనే గొడవ మొదలైంది. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు కూడా నమోదైంది. అయితే ఈ గొడవతో బీఆర్ఎస్ కి లాభం ఎలా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఏపీ, తెలంగాణ గొడవ పడితే.. ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారంటూ కాంగ్రెస్, సీపీఐ వితండవాదం చేస్తున్నాయి కానీ, దానికి బలమైన కారణం మాత్రం చెప్పలేకపోతున్నాయి. కేసీఆర్ ని గెలిపించడం కోసం వైసీపీ కుట్రపన్నిందని మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు నేతలు. లాజిక్ మిస్ అయిన ఈ ఆరోపణలు వినడానికి విడ్డూరంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అయితే కేసీఆర్, జగన్ ఉమ్మడి శత్రువులు మాత్రం ఇలా గాలిలో బాణాలు వేస్తూనే ఉన్నారు. 


Tags:    
Advertisement

Similar News