కవిత విడుదల.. వడ్డీతో సహా చెల్లిస్తానంటూ వార్నింగ్‌

తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు కవిత. ఇకపై తన పోరాటం అన్‌బ్రేకబుల్‌ అంటూ కామెంట్స్ చేశారు.

Advertisement
Update:2024-08-27 21:49 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జైలు నుంచి విడుదలకాగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు, భర్తను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత. రేపు కేటీఆర్, హరీష్ రావుతో కలిసి హైదరాబాద్‌కు రానున్నారు.

కవిత విడుదల కోసం దాదాపు రెండు గంటల పాటు తీహార్ జైలు దగ్గర వేచి చూసిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఆమె బయటకు రాగానే బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కారుపైకి ఎక్కిన కవిత జై తెలంగాణ అంటూ పలుమార్లు నినదించారు.


అనంతరం అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు కవిత. కేటీఆర్, హరీష్‌ రావు టీమ్ తన కోసం బాగా పని చేసిందని, వారికి కృతజ్ఞతలు చెప్పారు కవిత. కష్టకాలంలో పార్టీకి, తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు థాంక్స్ చెప్పారు. ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్నానన్న కవిత, తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో చెల్లిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. అనవసరంగా తనను జగమొండిగా మార్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు కవిత. రాజకీయంగానూ, న్యాయపరంగానూ తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఇకపై తన పోరాటం అన్‌బ్రేకబుల్‌ అంటూ కామెంట్స్ చేశారు కవిత.

Tags:    
Advertisement

Similar News