భద్రతకు, భరోసాకు మారుపేరు.. ప్రశాంతతకు చిరునామా
పోలీసు వ్యవస్థని పూర్తిగా అధునీకరించి, అవసరాల మేర పునర్ వ్యవస్థీకరించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఆధునిక హంగులతో కూడిన కొత్త వాహనాలతో పోలీసింగ్ ని మరింత పటిష్టపరిచామన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు సురక్షా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ శాంతి భద్రతలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ అని అన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో శాంతి భద్రతల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను ఉపయోగిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తొమ్మిదేళ్లుగా పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకుందన్నారు.
ఆధునీకరణ, పునర్ వ్యవస్థీకరణ..
పోలీసు వ్యవస్థని పూర్తిగా అధునీకరించి, అవసరాల మేర పునర్ వ్యవస్థీకరించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఆధునిక హంగులతో కూడిన కొత్త వాహనాలతో పోలీసింగ్ ని మరింత పటిష్టపరిచామన్నారు. పోలీసు నియామకాలను భారీగా పెంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కమిషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్లు, సరికొత్త జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలతో పోలీసు వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయిందన్నారు.
షీ టీమ్స్, సీసీ కెమెరాల నిఘా..
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ 'షీ టీమ్స్', 'షీ క్యాబ్స్' వంటి వినూత్న ఆలోచనలతో ఆడబిడ్డల రక్షణకు కేసీఆర్ ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. పోకిరీల ఆగడాలు అరికట్టడంలో గణనీయమైన ఫలితాలు సాధించిందని చెప్పారు. షీ టీమ్స్ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణలో 10 లక్షల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కవరేజీని పెంచామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సీసీటీవీల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేశామని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక సీసీటీవీలతో పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ ఉన్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు కేటీఆర్.
కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలోనే తొలిసారిగా అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓ అద్భుతం అని కొనియాడారు కేటీఆర్. మెరుగైన శాంతిభద్రతల కోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ, 360 డిగ్రీల కోణంలో నిఘాను కొనసాగిస్తూ, ప్రజల భద్రతకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భరోసా కల్పిస్తోందన్నారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ వింగ్ (EVDM)ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, విపత్తు నిర్వహణలో ప్రజలకి అండగా నిలుస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఒకప్పుడు మత కల్లోలాలతో నష్టపోయిన హైదరాబాద్ మహానగరంలో గత తొమ్మిదేళ్లుగా అలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదన్నారు. అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక అయిన తెలంగాణ మత సామరస్య పరిరక్షణలో దేశానికే ఆదర్శం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసు, ఇతర సంబంధిత శాఖల్లోని ప్రతి ఒక్కరికీ శిరసువంచి నమస్కరిస్తున్నాననంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.