మోదీ ఎవరికి దేవుడు..? – కేటీఆర్
గ్యాస్ సిలిండర్ రేటుని 400 రూపాయల నుంచి 1200 రూపాయలకి పెంచిన మోదీ దేవుడా అని ప్రశ్నించారు కేటీఆర్. పెట్రోల్ రేటు పెంచిన దేవుడు మోదీ, తెలంగాణకు ఒక్క విద్యా సంస్థ ఇవ్వకుండా యువకుల పాలిట దేవుడిగా మారిన వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీపై మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఆయన దేవుడంట, ఎవరికి దేవుడు, ఏం చేశాడని దేవుడు.. అంటూ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేవుడయ్యా మోదీ.. అంటూ గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని చెలరేగిపోయారు కేటీఆర్.
గ్యాస్ సిలిండర్ రేటుని 400 రూపాయల నుంచి 1200 రూపాయలకి పెంచిన మోదీ దేవుడా అని ప్రశ్నించారు కేటీఆర్. పెట్రోల్ రేటు పెంచిన దేవుడు మోదీ, తెలంగాణకు ఒక్క విద్యా సంస్థ ఇవ్వకుండా యువకుల పాలిట దేవుడిగా మారిన వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. 13 నెలలు రైతుల్ని ఢిల్లీ శివారులో చలిలో, వానలో, ఎండలో చావగొట్టి 700మంది చావుకి కారణమైన మోదీ దేవుడు, నల్ల చట్టాలు తెచ్చిన మోదీ దేవుడు, గిరిజన రిజర్వేషన్లు పెంచని మోదీ దేవుడు, చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ దేవుడు.. అని విమర్శించారు కేటీఆర్.
ఇదెక్కడి లాజిక్..
మోదీ పెట్రోల్ రేటు పెంచుతారు, కానీ తెలంగాణలో ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచితే మాత్రం బీజేపీ నాయకులు ధర్నాలకు దిగుతారు.. ఇదెక్కడి లాజిక్ అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఆర్టీసీ బస్సుని దేనితో నడపాలి, డీజిల్ తోనా, నీళ్లతోనా, డీజిల్ రేట్లు పెంచితే టికెట్ రేట్లు పెంచకుండా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టాలా అని ప్రశ్నించారు.
యుద్ధాన్ని ఆపాడా.. వాట్ ఎ జోక్..
కర్నాటక, మహారాష్ట్ర.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. వాటి మధ్య చిన్న గట్టు పంచాయితీ తేల్చలేని మొగోడు మోదీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారట అంటూ చెణుకులు విసిరారు కేటీఆర్. కరోనా సమయంలో మోదీ వ్యాక్సిన్ కనిపెట్టారంటూ కిషన్ రెడ్డి లాంటి వారు చెప్పడం ఈ ప్రచారానికి హైలెట్ అని అన్నారు. కిషన్ రెడ్డి కరోనా సమయంలో కుర్ కురే ప్యాకెట్లు పంచి పెట్టారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల సెస్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో బీజేపీకి అసలైన సినిమా చూపిస్తామని ఛాలెంజ్ విసిరారు కేటీఆర్.