తెలంగాణ అభివృద్ధి పథం.. ఆదర్శం, అనుసరణీయం
సుసంపన్నమైన వ్యవసాయానికి తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రైతు సంక్షేమ విధానాలు తమకు కూడా కావాలని ఇతర రాష్ట్రాల రైతులు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉందని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని అన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రతి తెలంగాణ బిడ్డకు ఈ విజయం గర్వకారణమన్నారు. కేసీఆర్ మానవతా దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దూరదృష్టితో కూడిన ప్రణాళిక, పారదర్శక పరిపాలనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగిందని వివరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
సుసంపన్నమైన వ్యవసాయానికి తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రైతు సంక్షేమ విధానాలు తమకు కూడా కావాలని ఇతర రాష్ట్రాల రైతులు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. కేసీఆర్ సుపరిపాలనలో రైతుల పేదరికం తొలగిపోయి వారిలో ధైర్యం పెరుగుతోందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం వంటి విషయాల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే నికర సాగు భూమి 2016లో 1,77,960 ఎకరాల నుంచి 2,40,430 ఎకరాలకు పెరిగిందని చెప్పారు కేటీఆర్. రైతుబంధు పథకం ద్వారా నేరుగా 1,130 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.
ఆయిల్ పామ్ లో సాగుకోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 292 మంది రైతులు వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం గోడౌన్లు నిర్మించిందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు 4200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవసాయ గోడౌన్లు 14 మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్ల జిల్లాలో 33 కోట్లతో 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గోడౌన్లు నిర్మించారమని వివరించారు. రూ.20 కోట్లతో సిరిసిల్ల సర్దాపూర్ గ్రామంలో 25 ఎకరాల్లో విశాలమైన, అధునాతన మార్కెట్ యార్డు, సిరిసిల్ల పట్టణంలో రూ. 5.15 కోట్లతో రైతుబజార్ నిర్మించామన్నారు. జిల్లాలో 1803 రైతు కుటుంబాలకు రూ.90.15 కోట్ల రైతుబీమా పరిహారం చెల్లించి ఆదుకున్నామని చెప్పారు.