సభలు, సమావేశాలు, రోడ్ షో లు.. ఎన్నికల వేళ కేటీఆర్ రికార్డ్ బ్రేక్

60 రోజుల ప్రచారంలో.. 70 రోడ్ షోలు, 30 చోట్ల బహిరంగ సభలు, సమావేశాలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150 కి పైగా టెలికాన్ఫరెన్స్ లు.. ఇదీ కేటీఆర్ ట్రాక్ రికార్డ్.

Advertisement
Update:2023-11-28 17:07 IST

తెలంగాణ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు కానీ హైదరాబాద్ లో మాత్రం సభ నిర్వహించలేదు. షెడ్యూల్ లో ఉన్నా వర్షం కారణంగా బహిరంగ సభ ఆగిపోయింది. కానీ బీఆర్ఎస్ లో ఎక్కడా ఆ లోటు కనపడలేదు. కారణం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ ని ఒకటికి రెండు సార్లు చుట్టేశారు. ఆ మాటకొస్తే దాదాపు రాష్ట్రమంతా కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తించారు. ఓవైపు మీటింగ్ లకు వెళ్తూనే మరోవైపు ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. వివిధ వర్గాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. దాదాపుగా 60రోజులపాటు కేటీఆర్ కాళ్లకు చక్రాలు కట్టుకుని రాష్ట్రమంతా కలియదిరిగారు.

కేటీఆర్ బిజీ షెడ్యూల్..

60 రోజుల ప్రచారం..

70 రోడ్ షోలు…

30 చోట్ల బహిరంగ సభలు, సమావేశాలు

30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు

150 కి పైగా టెలికాన్ఫరెన్స్ లు

ఇవికాక మెట్రోలో ప్రయాణం, టీ కేఫ్ లలో మాటామంతీ, కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశాలు, సొంత నియోజకవర్గంలోని నాయకులకు దిశా నిర్దేశం.. ఇలా ముందుకు కదిలారు మంత్రి కేటీఆర్. 2 నెలలపాటు విశ్రాంతి లేకుండా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

అన్నీ తానై..

వాస్తవానికి కేటీఆర్ ప్రచార పర్వం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మొదలైంది. షెడ్యూల్ విడుదల కాకముందే దాదాపు 30 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు కేటీఆర్. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా అదే జోరు కొనసాగించారు. బీఆర్ఎస్ అభివృద్ధి ప్రస్థానాన్ని సమర్థంగా వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. మూడోసారి కూడా తెలంగాణకు బీఆర్ఎస్ ఎంత అవసరమో వివరించారు.

విమర్శలకు ఘాటు సమాధానాలు..

ఈ దఫా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ విమర్శల ధాటి తగ్గించారు. అభివృద్ధిపై, ప్రజాస్వామ్య పరిణతిపై, ఆయా నియోజకవర్గాల్లో చేసిన, చేయాల్సిన పనులపై ఆయన ప్రచారంలో ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ కేటీఆర్.. ఎప్పటికప్పుడు వైరి వర్గాల పనిపట్టారు. విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పై ప్రజలకున్న నమ్మకాన్ని వివరించారు. ప్రత్యర్థి వర్గం ఎక్కుపెట్టే విమర్శలకు కేటీఆర్ నుంచి ఘాటుగా సమాధానాలు వచ్చేవి.

గ్రేటర్ లో వన్ మ్యాన్ షో..  

అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలు చేపట్టారు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి , మల్కాజ్ గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలలో పాల్గొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

మీడియా..

నేరుగా ప్రజల మధ్యలో చేపట్టే ప్రచారం వేరు, ఇంటర్వ్యూలతో మీడియా ద్వారా చేసే ప్రచారం వేరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో లు నిర్వహించిన కేటీఆర్.. సాయంత్రం తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. జయప్రకాష్ నారాయణ, గోరటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారికి ప్రత్యేక ఇంటర్వ్యూలిచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపుగా అన్ని ఛానెళ్లకు, ప్రింట్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలిచ్చారు. ఇవి కాకుండా సోషల్ మీడియా స్టార్స్ కి కూడా ఇంటర్వ్యూలిచ్చారు. అదే సమయంలో 'ఉమన్ ఆస్క్ కేటీఆర్' వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని స్లైడ్ ల ద్వారా సోదాహరణంగా వివరించారు. హెలికాప్టర్ లో ప్రయాణ సమయాన్ని కూడా ఇంటర్వ్యూలకు కేటాయించారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పార్టీ కోసం, పార్టీ ప్రచారం కోసం కష్టపడ్డారు కేటీఆర్. రోజుకి దాదాపు 15-18 గంటల వరకు పనిచేశారు.

సోషల్ మీడియా..

తనకు తానుగా ఇచ్చే ఇంటర్వ్యూలు వేరు, తన అధికారిక ఖాతాల్లో వెలువరించే మెసేజ్ లు వేరు. సోషల్ మీడియాలో కూడా కేటీఆర్ తన పోస్టింగ్ లతో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేవారు. తన ట్వీట్లతో వైరి వర్గాల్లో గుబులు పుట్టించారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపై వచ్చిన విమర్శలను సాధికారికంగా తిప్పికొట్టారు కేటీఆర్. ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేసి మరీ.. తెలంగాణలో యువత కోసం పాటుపడింది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గణాంకాలతో సహా నిరూపించారు.

మేనిఫెస్టోకి విస్తృత ప్రచారం..

ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. చివర్లో మేనిఫెస్టోని వివరించేవారు మంత్రి కేటీఆర్. సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి, గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు అనే వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరెంటు పంపిణీపై కాంగ్రెస్ నేతల అజ్ఞానాన్ని బయటపెట్టారు. సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ కేవలం పదేళ్ల కాలంలోనే సాధించిందని, ఇది విజన్ ఉన్న నాయకత్వం ఉండటం వల్లే సాధ్యమైందని కేటిఆర్ అడుగడుగునా గుర్తుచేశారు. కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు, బస్తీవాసుల నుంచి బంజారాహిల్స్ వరకు ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్న మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ప్రత్యేక గుర్తింపు సాధించారు కేటీఆర్.

ఆల్ రౌండర్..

2 నెలలపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ని అన్నీ తానై ముందుకు నడిపించారు కేటీఆర్. స్టార్ క్యాంపెయినర్ గా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్ల అభ్యర్థిగా.. అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోయారు. ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందనే తనను ముందుకు నడిపించిందని, ప్రజలకు మంచి చేస్తే, వారు అండగా ఉంటారన్న బలమైన నమ్మకంతో తన ప్రచార కార్యక్రమాలు నిరాటంకంగా సాగాయని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ ని మరోసారి ప్రజలు గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం తనకుందన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తమ వెంట నడిచిన తెలంగాణ సమాజం వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గుండెల నిండా ఆశీర్వదించాలని కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.


Tags:    
Advertisement

Similar News