ప్రభాకర్ రెడ్డికి హరీష్ రావు పరామర్శ.. ఘటనపై గవర్నర్ స్పందన
ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అత్యంత గర్హనీయం అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించామన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అధైర్య పడవద్దని చెప్పారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు హరీష్ రావు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనను ఖండించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం అన్నారు. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే సమయంలో వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, అలాంటి వాతావరణం ఉండేలా చూడటం అవసరం అని చెప్పారు తమిళిసై.
ప్రభాకర్ రెడ్డి దాడి ఘటన తర్వాత తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రచారంలోకి వెళ్లే సమయంలో ప్రజలను కలిసే సమయంలో నాయకులు, తమ సెక్యూరిటీని పెద్దగా పట్టించుకోరు. ప్రతి ఒక్కరినీ కలవాలని, కరచాలనం చేయాలని, వారితో అభిమానంగా మాట్లాడాలనుకుంటారు. దీన్ని అలుసుగా తీసుకున్న దుండగుడు.. ప్రభాకర్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చే నెపంతో దగ్గరయ్యాడు. హఠాత్తుగా పొట్టలో పొడిచాడు. ఈ దుశ్చర్య వెనక కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
♦