ధరలు పెంచే బీజేపీ.. నిధులు పంచే కేసీఆర్
రైతులకు 3 గంటలు కరెంటు చాలనుకుంటే కాంగ్రెస్ కి, 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్ కు ఓటేయాలన్నారు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. ఈ పాపపు కాంగ్రెస్, శాపపు బీజేపీలు అవసరమా అని రైతులు ఆలోచించాలన్నారు హరీష్ రావు.
కనీ వినీ ఎరుగని రీతిలో ధరలు పెంచుతూ కేంద్రం పేద, మధ్యతరగతి వర్గాలపై పెను భారం మోపిందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అదే సమయంలో వివిధ పథకాలతో పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు పంచి పెడుతోందని వివరించారు. ధరలు పెంచుడు బీజేపీ పని, పేదలకు నిధులు పంచుడు కేసీఆర్ పని అని తనదైన శైలిలో పోలిక చెప్పారు.
మహేశ్వరం నియోజకవర్గంలో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 17 వేల బెడ్స్ ఉంటే.. ఇప్పుడవి 50 వేలకు చేరుకున్నాయని కేసీఆర్ హయాంలో మూడింతలు పెరిగాయన్నారు హరీష్ రావు. నాడు తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉండే.. కేసీఆర్ నాయకత్వంలో 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయన్నారు.
వైద్యం, విద్య, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందు ఉందని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. మన ఊరు – మన బడితో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు పడ్డాయన్నారు. తెలంగాణ రైతు బంధుని కేంద్రం కాపీ కొట్టి పీఎం - కిసాన్ అనే పేరు పెట్టుకుందని.. మిషన్ భగీరథను కాపీకొట్టి, హర్ ఘర్ కో జల్ అనే పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పథకాలను కాపీ కొట్టారు కానీ, వాటి అమలులో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కేంద్రానికి లేదని విమర్శించారు. రైతులకు 3 గంటలు కరెంటు చాలనుకుంటే కాంగ్రెస్ కి, 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్ కు ఓటేయాలన్నారు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. ఈ పాపపు కాంగ్రెస్, శాపపు బీజేపీలు అవసరమా అని రైతులు ఆలోచించాలన్నారు హరీష్ రావు.