చంద్రబాబు దుకాణం ఎత్తేసిండు.. అందుకే
బీఆర్ఎస్ జాబితా విడుదలైన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి నియోజకవర్గాల్లో వారు బిజీ అయ్యారు. మిగిలిన అభివృద్ధి పనులను వడివడిగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ ని మోసం చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్టే అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలన ఎలా ఉందో ప్రజలే పోల్చుకోవాలని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, ఆ రెండు పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడ చేయలేని పనులు ఇక్కడికొచ్చి చేస్తామంటే ఎలా నమ్మాలన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలన గురించి ప్రజలకు వివరించారు.
చంద్రబాబు దుకాణం ఎత్తేసిండు..
ఇక టీడీపీ సానుభూతి పరులను ఆకట్టుకునేలా మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టాలని తనకు లేదని, కానీ చంద్రబాబు తెలంగాణలో దుకాణం ఎత్తేయడం వల్ల తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. "చంద్రబాబు దుకాణం ఎత్తేసి అవతల పడ్డడు.. మరి నేనేం జేయాలె. కొట్టుకు సచ్చినా టీడీపీ ఇక్కడ లేత్తలేదు. ఉన్నోళ్లను కాపాడుకోవాల్నాయె. అదే టైంలో కేసీఆర్ మంచిగా పనిచేస్తుండె. ఆయనకు సపోర్ట్ చేయాలని పార్టీ మారిన." అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి.
పనులు, ప్రచారం..
బీఆర్ఎస్ జాబితా విడుదలైన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి నియోజకవర్గాల్లో వారు బిజీ అయ్యారు. మిగిలిన అభివృద్ధి పనులను వడివడిగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు పనులు చేస్తూ, ఇటు ప్రచారంలో కూడా స్పీడ్ పెంచారు. పార్టీకి, తమకు దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ.. ఎవరికి ఓటు వేసినా అది వృథాయే అంటున్నారు నేతలు. కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎంగా చేసుకుంటేనే.. తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని చెబుతున్నారు.