'మేక బతుకు'పై కేటీఆర్ ఏమన్నారంటే..?
సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురాగలిగే సాహిత్యానికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. పుస్తక ప్రచురణలతో పాటు డిజిటల్ మీడియాలో ఆడియో బుక్స్ కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నం జరగాలన్నారు.
ప్రస్తుతం సమాజంలో చదివే అలవాటు బాగా తగ్గుతూ వస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలాంటి సమయంలో కూడా తెలుగు పుస్తకాలను అచ్చు వేసి పాఠకుల ముందుకు తీసుకు రావడం అభినందనీయం అని చెప్పారు. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో 'మేక బతుకు' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రచయిత స్వర్ణ కిలారి, ప్రచురణకర్తలను అభినందించారు. సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురాగలిగే సాహిత్యానికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. పుస్తక ప్రచురణలతో పాటు డిజిటల్ మీడియాలో ఆడియో బుక్స్ కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నం జరగాలన్నారు.
వలస దోపిడీ..
స్వర్ణ కిలారిగారి 'మేక బతుకు' పుస్తకావిష్కరణ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల కష్టాలను తాను స్వయంగా గల్ఫ్ లో వాళ్లు నివశించే ప్రాంతాలకు వెళ్లి చూశానని, అక్కడి పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయని చెప్పారు. చిన్న గదిలో 8 మంది, 10మంది, 20మందిని కూడా కుక్కేస్తారని.. జల పురుగులు, కాక్రోచ్ లు, అక్కడే వారి మధ్యే తిరుగుతుంటాయని, వారంలో 7 రోజులూ వారితో పనిచేయిస్తారని తెలిసి తాను చాలా బాధపడ్డానని అన్నారు. వలస కార్మికులకు ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉపాధి కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ మనుషుల ప్రవర్తనలో ఒక వైచిత్రి ఉండటం వల్ల అది సాధ్యం కాలేదన్నారు. మన కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లి చేసే పనులు, మన రాష్ట్రంలో చేయడానికి మాత్రం ఇష్టపడరని వివరించారు కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా మెరుగుపడ్డాయని.. బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా నుంచి వేలాదిమంది కార్మికులు తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఉపాధినే మనవాళ్లు గల్ఫ్ దేశాలకు పోయి సంపాదించుకుంటున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణకు వచ్చినా, తెలంగాణ వారు గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందినా.. జీతాలలో పెద్ద తేడా ఉండదని అన్నారు. తెలంగాణలో లభించి జీతాలకంటే గల్ఫ్ లో 5 నుంచి 10 శాతం మాత్రమే జీతం ఎక్కువ వస్తుందన్నారు. అయినా మనవాళ్లు అక్కడ చేసే పనుల్నే ఇక్కడ చేయడానికి ఇబ్బంది పడుతుంటారని, ఆ మనస్తత్వం తనకు కూడా ఆశ్చర్యం కలిగించిందని అన్నారు కేటీఆర్.
వలసలు రెండు మూడు రకాలుగా ఉంటాయని.. అత్యున్నత జీవన ప్రమాణాలు పొందడానికి, మంచి జీతాలు పొందడానికి ఇంకా మంచి జీవితం అనుభవించడానికి కొంతమంది అమెరికా, యూరప్ దేశాలకు వెళ్తుంటే.. మరికొందరు ఉపాధికోసం వలసబాట పడుతుంటారని చెప్పారు కేటీఆర్.
దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా.. వలస ఎంత వాస్తవమో వలసలో దోపిడీ కూడా అంతే వాస్తవం అన్నారు కేటీఆర్. పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్‌లోని జైలుకు వెళ్లి కలిసి వచ్చానని, వారిని విడిపించేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నించామని, చివరికి విజయవంతం అయ్యామని, జైలులో మగ్గిపోతున్న వారిని భారత్ కి తిరిగి తీసుకురాగలిగామని చెప్పారు కేటీఆర్. గతంలో గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తేవాలని ప్రయత్నం చేసినట్టు చెప్పారు. టామ్‌కామ్ సంస్థ ద్వారా కొంత ప్రయత్నం జరిగిందన్నారు. వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 'మేక బతుకు' పుస్తకం ఓ మంచి ప్రయత్నం అని అభినందించారు కేటీఆర్. ఈ సాహిత్య సభకు డాక్టర్ నీరజ గారు అధ్యక్షత వహించారు.